భక్తి కంటే సత్ప్రవర్తనే ముఖ్యం

భక్తి కంటే సత్ప్రవర్తనే ముఖ్యం

శ్రమను మించిన సౌందర్యం లేదు

కలెక్టర్ జితేష్ వి పాటిల్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: మనుషులందరూ ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేదని, శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి  పాటిల్ అన్నారు.  మహాత్మా బసవేశ్వరుని 890వ జయంతి వేడుకలను పురస్కరించుకుని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం బసవేశ్వర జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వర చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , వీరశైవ జంగం సమాజం ప్రతినిధులు, బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించిన విశ్వగురువుగా అందరి హృదయాల్లో బసవేశ్వరుడు చిరస్థాయిగా నిలిచిపోతారని  తెలిపారు. కుల, వర్ణ, వర్గ, లింగ వివక్ష లేకుండా సమసమాజ నిర్మాణం కోసం కొన్ని వందల ఏళ్ల క్రితమే బసవేశ్వరుడు కృషి చేశారన్నారు. 

ఆ కాలంలోనే మహిళా సాధికారత కోసం పాటుపడిన మహోన్నతులు బసవేశ్వరుడని  కొనియాడారు.ప్రతిఒక్కరూ బసవేశ్వరుడి అడుగుజాడల్లో నడవాలని చెప్పారు.  బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త అని, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకు శ్రీకారం చుట్టిన మహోన్నతుడు పేర్కొన్నారు. బసవేశ్వరుని ఆచరణలు నేటికీ కొనసాగడం సంతోషకరమని, ఆయన చూపిన అడుగు జాడల్లో ప్రజలందరూ పయనించాలని  అన్నారు. జయంతి వేడుకల కార్యక్రమంలో  జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు, కౌలాస్ పీఠాధిపతి మల్లికార్జున అప్ప, జిల్లా జంగం సమాజం అధ్యక్షుడు మఠం విజయ్ కుమార్, బీసీ ప్రతినిధులు శివరాం, రాజయ్య, జై గౌడ ఉద్యమ సంఘం కల్లుగీత సంగం జిల్లా అధ్యక్షుడు చెన్నం గారి మహేష్ గౌడ్, వీరశైవ జంగం సమాజం ప్రతినిధులు ప్రభాకర్, వీరయ్య, సంగప్ప, వీర మహేందర్, సుభాష్ పాల్గొన్నారు.