ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి....

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి....

టీ బీ టెస్టులను  మరింతగా పెంచాలి... -కలెక్టర్ అనురాగ్ జయంతి 

ముద్ర, గంభీరావుపేట :ధాన్యం కొనుగోలు కేంద్రాల లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని,కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయంకు వచ్చిన రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని  కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం గంభీరావుపేట మండలం గజ సింగవరం గ్రామంలో ప్యాక్స్  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ను   తనిఖీ చేశారు.కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్ల తీరు పరిశీలించారు.ఇప్పటి వరకూ ఎంత పంట కొనుగోలు చేశారు, ఇంకా ఎంత కొనాల్సి ఉంది,తదితర వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.కొనుగోలు కేంద్రానికి ధాన్యం ను తీసుకు వచ్చిన వెంటనే తేమ శాతం పరిశీలించి నిర్ణీత తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోళ్లు నిర్వహించాలని, ఒపియంఎస్ లో వివరాలు నమోదు చేయాలని అన్నారు. కొను గోలు కేంద్రాలలో హమాలీ లు కొరత లేకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం ను వెంటనే  లోడింగ్ రైస్ మిల్లులకు తరలించాలని చెప్పారు.అనంతరం  గంభీరావుపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఓపి ఎంత వస్తుంది అని సంబంధిత వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం ఓపి రిజిస్టర్, ల్యాబ్ టెక్నీషియన్ రిపోర్టు రిజిస్టర్, వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ లను పరిశీలించారు. సామాజిక కేంద్రంలో అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారా లేదా అని వైద్యులను ప్రశ్నించారు. ఇంకా ఏమైనా చేయని టెస్టులు ఉన్నాయా అంటూ వివరాలు తెలుపాలన్నారు. క్షయ పరీక్షలు గత నెలలో ఐదు మాత్రమే చేసినట్లు చెప్పడంతో క్షయ పరీక్షల సంఖ్యను మరింతగా పెంచాలని  వైద్యులకు సూచించారు. ఆరోగ్యశ్రీ కింద నిధులను సాధ్యమైనంత ఎక్కువగా ట్యాప్ చేయాలని వైద్యులకు సూచించారు. ఫిజియోథెరపీ సేవలను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు.  సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏ ఏ పరికరాలు పనిచేయడం లేదో తనకు వివరాలు ఇవ్వాలని వాటిని వెంటనే ఉపయోగం లోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.  అలాగే సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న విద్యుత్  సమస్యలను వైద్యులు జిల్లా కలెక్టర్ దృష్టికి తేవడంతో వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సెస్ ఎండి రామ కృష్ణ తో మాట్లాడారు. వెంటనే సంబంధిత టెక్నీషియన్లను పంపి విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ  కార్యక్రమంలో  జిల్లా పౌర సరఫరా ల అధికారి బుద్ధ నాయుడు, జిల్లా పౌర సరఫరాల అధికారి  జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జితేంద్ర ప్రసాద్,  సి హెచ్ సి సూపర్డెంట్  శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.