త్వరలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు : ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్

త్వరలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు : ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్
  • వర్ధన్నపేటలో భూమిని గుర్తించాం:ఎమ్మెల్యే అరూరి రమేశ్
  • ప్రెస్ క్లబ్ కార్యవర్గ సన్మానం 

ముద్ర ప్రతినిధి, వరంగల్ : జర్నలిస్టులకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో అభినందన సభ అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వినయ్ భాస్కర్ మాట్లాడారు. ఎంతోకాలంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇండ్ల స్థలాల సమస్యను తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోపే అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరిస్తానని తెలిపారు. జర్నలిస్ట్ లకు న్యాయం చేసేందుకు ప్రెస్ క్లబ్, జర్నలిస్టుల సొసైటీ సహకారంతో ముందుకు సాగుతానన్నారు. 

వర్ధన్నపేటలో స్థలం గుర్తించాం : అరూరి నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు తన నియోజకవర్గం పరిధిలోని భూమిని గుర్తించామని, త్వరలోనే దానికి కార్యరూపం రానుందని వివరించారు. తన నియోజకవర్గంలోని పలు మండలాలలో ఇప్పటికే జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు అందించామని, మరిన్ని మండలాలకు అందించాల్సి ఉందని తెలిపారు.  ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తమ యూనియన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తేవాలన్నారు. సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ మేరకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.

ఘనంగా సన్మానం.. 

 ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్యతోపాటు కార్యవర్గాన్ని మెమోంటో, శాలువాలతో ప్రజాప్రతినిధులు యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. టీఎన్జీవో, టీజీఓ, ఉద్యోగ, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కార్యవర్గానికి సన్మానం చేశారు. సమావేశానికి  ఐజేయూ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి అధ్యక్షత వహించగా మేయర్ గుండు సుధారాణి, ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీ రవీందర్రావు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఐజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, జాతీయ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, గాడిపెల్లి మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామచందర్, దుర్గాప్రసాద్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, శివకుమార్, పీవీ మదన్మోహన్, నాయకులు సంతోష్, రవి, రంగనాథ్, రజనీకాంత్, బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కార్యవర్గానికి ఎర్రబెల్లి అభినందన..

 ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అభినందన సభ ప్రారంభానికి ముందే కార్యవర్గాన్ని కలిసి సన్మానించారు. ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేయాలని కార్యవర్గానికి సూచించారు. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు హామీ ఇచ్చారు.