కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వరు

కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వరు
  • ఎమ్మెల్యేని, జిల్లా మంత్రిని ఇవాళ రమ్మని చెప్పినా రాలేదు
  • రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం ప్రధానితో మాట్లాడిన..
  • భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి 
  • జనగామ రైల్వే స్టేషన్ లో రూ.24.5 కోట్ల అభివృద్ధికి శంకుస్థాపన

ముద్ర ప్రతినిధి, జనగామ : ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా ఎవరైనా కేంద్రంతో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడితో మాట్లాడి, చర్చలు జరిపితేనే అభివృద్ధి జరుగుతుందని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ వర్చువల్ ద్వారా ఆదివారం శంకుస్థాపన చేశారు. జనగామ రైల్వే స్టేషన్ లో రూ.24.5 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జనగామలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్రంతో తాను చర్చలు జరిపి భువనగిరితో పాటు జనగామ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కృషి చేసినట్టు తెలిపారు.

దేశంలో రైల్వే వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు వందే భారత్ ట్రైన్స్, రైల్వే స్టేషన్ల అభివృద్ధి సహా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.  ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో ఈ రెండు రైల్వే స్టేషన్లు కొత్త మోడల్ లో అభివృద్ధి చేయాలని కోరాను. ఎంఎంటీఎస్ ట్రైన్ ఘట్ కేసర్ వరకే ఉందని, పొడిగింపులో భాగంగా రాయగిరి వరకే చేయాలని ప్రపోజల్ వచ్చిందాని కానీ, నేను మాట్లాడి ఆ ప్రపోజల్ ను మార్పించి యాదగిరి గుట్ట వరకు పొడిగించానని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా కట్టకుండా ఉంటే ఇలా కుదరదని ప్రధాని మోడీతో చర్చలు జరిపి రాష్ట్రంతో సంబంధం లేకుండా ఎంఎంటీఎస్ పొడిగించాలని కోరానాని చెప్పారు. కేంద్ర మంత్రితో కూడా చర్చలు జరిపానని, ఇద్దరూ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. యాదగిరి గుట్ట వరకు కొత్త లైన్ వేస్తున్నామని చెప్పారు. అలాగే, జనగామ వరకు ఎంఎంటీఎస్ పొడిగిస్తామని హామీ ఇచ్చారు. 

ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా కేంద్రంతో మాట్లాడి చర్చలు జరిపితేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఎక్కువ నిధులు తీసుకొచ్చింది నేనే అని అన్నారు. రహదారులు, ఫ్లైఓవర్ల  కేంద్రంతో ఎన్నోసార్లు చర్చలు జరిపానాని, అనుకున్నది సాధించానని తెలిపారు. నేను ఒకరోజు ముందు అడిగినా ప్రధాని అపాయింట్ మెంట్ ఇస్తారు.. కోమటిరెడ్డి అపాయింట్ మెంట్ అడిగితే అభివృద్ధి గురించే వస్తారని ఆయనకు తెలుసు.. అందుకే వెంటనే ఇస్తారని,  విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం చర్చలు జరిపినట్టు చెప్పారు. కేసీఆర్ ఎలాగూ అపాయింట్ మెంట్ ఇవ్వరు,  అందుకే కేంద్రంతో మాట్లాడుకోవాల్సి వస్తోందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు కొట్లాడుకోవాలి, మిగిలిన సమయాల్లో ప్రజల కోసం కలిసి పని చేయాలన్నారు. ఎమ్మెల్యేని, జిల్లా మంత్రిని ఇవాళ రమ్మని చెప్పినా రాలేదని, ఇది కరెక్ట్ కాదన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాపరెడ్డి, కేవీఎల్ఎన్ రెడ్డి, మాజీ చైర్మన్లు వేమల్ల సత్యనారాయణ రెడ్డి, ఎర్రమల సుధాకర్, కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త  పాల్గొన్నారు.