‘పాలమూరు, రంగారెడ్డి’పై ఎందుకీ వివక్ష?

‘పాలమూరు, రంగారెడ్డి’పై ఎందుకీ వివక్ష?
  • జిల్లాలు పచ్చబడటం బీజేపీకి ఇష్టం లేదు
  • పర్యావరణ అనుమతి నిరాకరణపై కేంద్రానికి కేటీఆర్​బహిరంగ లేఖ

ముద్ర, తెలంగాణ బ్యూరో : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల రెండో దశ పర్యావరణ అనుమతులను కేంద్రం పక్కనపెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్టుతో పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ పచ్చబడటం కేంద్రానికి ఇష్టం లేదంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న వివక్షపూరిత వైఖరిపై తీవ్ర నిరాశతో ఈ లేక రాస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించే విధంగా పలుమార్లు వ్యాఖ్యానించారని ఈ గుర్తు చేశారు. తెలంగాణ ప్రగతిని, పురోగతిని ఓర్వలేని కేంద్రం.. తన పరిధిలో ఉన్న అంశాలను కూడా తేల్చకుండా తెలంగాణ అభివృద్ధిని తొమ్మిదేళ్లుగా అడ్డుకుంటూనే ఉందని మండిపడ్డారు.  

  • అడ్డంకులు సృష్టించడం శోచనీయం?

రాష్ట్రం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్షతో వ్యవహరిస్తోందని కేటీఆర్​అన్నారు. ఈ ప్రాజెక్టుకి రెండో దశ పర్యావరణ అనుమతి ఇవ్వకుండా పక్కనబెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాలైన నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆశాకిరణమన్నారు. 12.03 లక్షల ఎకరాలకు పైగా భూమికి సాగునీటిని, ప్రజలకు తాగునీటికి భరోసా అందిస్తూ, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే ఈ బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అడ్డంకులు సృష్టించడం శోచనీయమన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలు సాగులోకి రావడంతో ప్రాజెక్టు పరిధిలోని కోట్లాది ప్రజల జీవితాల్లో కచ్చితంగా గుణాత్మక మార్పు వస్తుందన్నారు.

  • అనుమతుల పేరుతో అడ్డంకులు..

 తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో కరువు కాటకాలతో ప్రజలు తల్లడిల్లేవారని కేటీఆర్​అన్నారు. తాగునీరు లేక నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య ఎదుర్కొంటే, సాగునీటి సౌకర్యం లేక మహబూబ్ నగర్ జిల్లా వలసల పాలైందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథతో నల్లగొండ ఫ్లోరైడ్ రాక్షస భూతాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తరిమికొట్టిందన్నారు. నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను మరింత సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఒకప్పుడు కరువుతో తల్లడిల్లిన ఈ జిల్లాల పచ్చబడడం కేంద్రానికి ఇష్టం లేనట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలన్న తెలంగాణ ప్రజల డిమాండ్ ను పెడచెవిన పెట్టిన కేంద్రం.. అనుమతుల పేరుతోనూ అడ్డంకులు సృష్టిస్తున్నదన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా నిరాకరిస్తున్న కేంగద్రం, తాజాగా పర్యావరణ అనుమతుల పేరుతో మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. తెలంగాణపై కేంద్రం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య పూరిత, వివక్షపూరిత వైఖరి దురదృష్టకరమనిఆ లేఖలో కేటీఆర్ వ్యాఖ్యానించారు.