ధాన్యాగారంగా కేసముద్రం! లక్షల బస్తాలతో నిండిన మిల్లులు

ధాన్యాగారంగా కేసముద్రం! లక్షల బస్తాలతో నిండిన మిల్లులు

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఇప్పుడు ధాన్యాగారంగా మారింది. ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధిక మొత్తంలో కేసముద్రం మండలంలోని రెండు బాయిల్డ్ మిల్లులతోపాటు పలు రా రైస్ మిల్లుల్లో దిగుమతి చేశారు. కేసముద్రం మండలంలో ఇప్పటివరకు సుమారు 5 లక్షలకు పైగా ధాన్యం బస్తాలను మిల్లుల్లో దిగుమతి చేసినట్లు సమాచారం. కొన్ని మిల్లులో స్థలం సరిపోక, వచ్చేది వర్షాకాలం కావడంతో తమకు అనుకూలంగా గోదాములు, షెడ్లు ఉన్న చోట దిగుమతి చేయడంతో ధాన్యం బస్తాలతో మిల్లులు కిక్కిరిసిపోయాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గురువారం వరకు 93133.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. అందులో 78067.840 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు షిఫ్టింగ్ చేశారు. దాదాపు 18 వేల మంది రైతుల నుంచి సేకరించిన లక్షల బస్తాల ధాన్యాన్ని మిల్లులకు తరలించడంతో కేసముద్రం మండలంలోని రైసుమిల్లులన్నీ దాదాపు ధాన్యంతో నిండిపోయాయి. తొలుత జిల్లా వ్యాప్తంగా 5 బాయిల్డ్ రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని కేటాయించగా, ఆ తర్వాత రైతుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో రా రైస్ మిల్లులకు సైతం యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేటాయించారు. 

కొత్త మిల్లులకు సైతం ధాన్యం కేటాయింపు!

యాసంగిలో పండించిన ధాన్యం పూర్తిగా బాయిల్డ్ రకం కావడంతో తొలుత ప్రభుత్వం బాయిల్డ్ రైస్ మిల్లులకు, మరికొంత రెగ్యులర్గా ప్రభుత్వానికి సీఎంఆర్ ఇచ్చే మిల్లులకు ధాన్యాన్ని కేటాయించాలని నిర్ణయించారు. అయితే అంచనాలకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు విక్రయానికి రావడం, ఇతర జిల్లాలకు కేటాయిస్తే అక్కడ లేనిపోని కొర్రిలు పెట్టి, ధాన్యం లారీలను తిప్పి పంపడంతో చేసేదేమీ లేక అధికారులు జిల్లాలోని 25 రైస్ మిల్లులకు ధాన్యాన్ని సిఎంఆర్ కోసం కేటాయించారు. అయితే ఇందులో కొత్తగా నిర్మిస్తున్న మిల్లులకు సైతం ధాన్యాన్ని కేటాయించడం గమనార్హం. యాసంగిలో పండించిన ధాన్యం రా రైస్ కు అనుకూలంగా ఉండదు. కేవలం ఉప్పుడు బియ్యానికి మాత్రమే పనికొస్తుందని మిల్లర్లు చెబుతున్నారు. ఈ యాసంగి సీజన్లో సీఎంఆర్ కోసం రా రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని మిల్లుపడితే ప్రతికూల వాతావరణం కారణంగా టార్గెట్ కు అనుగుణంగా క్వింటాలు ధాన్యానికి 67 కిలోల బియ్యం వచ్చే పరిస్థితి అసలే లేదంటున్నారు. దీనితో ఈ యాసంగి సీజన్లో సిఎంఆర్ కోసం రా రైస్ మిల్లులకు కేటాయించిన దాన్యం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది.