కేసముద్రం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లలో ప్రతిష్టంబన ట్రేడింగ్ కంపెనీల వద్ద యదేచ్ఛగా కొనుగోళ్లు

కేసముద్రం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లలో ప్రతిష్టంబన ట్రేడింగ్ కంపెనీల వద్ద యదేచ్ఛగా కొనుగోళ్లు

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లలో ప్రతిష్టంబన ఏర్పడింది. గత నెల 27న మిర్చి కొనుగోళ్లలో ధర తక్కువ పెట్టారంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మార్కెట్ కు నాణ్యమైన మిర్చి రావడంలేదని, చివరి దశలో ఏరిన మిర్చి (గ్రేడ్- 3) తీసుకువస్తుండడం, నాణ్యమైన మిర్చికి పలుకుతున్న ధర కావాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నారనే సాకుతో కొందరు వ్యాపారులు మిర్చి కొనుగోళ్లకు నిరాసక్తత చూపారు. ఫలితంగా మార్కెట్లో మిర్చి కొనుగోళ్లను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు పాలకమండలి చైర్ పర్సన్ నీలం సుహాసిని ప్రకటించారు. అయితే మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిపివేసిన వ్యాపారులు, తమ ట్రేడింగ్ కంపెనీల వద్ద యదేచ్చగా కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిపివేసి, ట్రేడింగ్ కంపెనీల వద్ద కొనుగోలు చేయడం పట్ల రైతులకు ఆశించిన ధర లభించకపోవడంతో పాటు, ఇతరత్రా సమస్యలు నెలకొంటే బాధ్యులు ఎవరనే విమర్శలు వస్తున్నాయి. మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు వారం రోజుల నుంచి బందు చేయడంతో ఉపాధి కోల్పోవాల్సి వచ్చిందని హమాలీ, కూలీ, దడువాయిలు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం రెగ్యులేటెడ్ మార్కెట్ ఉన్నచోట మార్కెట్ లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోళ్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇటు కేసముద్రం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిపివేసిన వ్యాపారులు, మార్కెట్ బయట కొనుగోళ్లు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గొడవ జరిగిన ప్రతిసారి ఏదో ఒక సాకుతో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను నిలిపివేయడం వల్ల, ఆదాయానికి గండి పడడంతో  పాటు మార్కెట్ ప్రతిష్ట మసకబారి పోయే ప్రమాదం ఉందంటున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోళ్లు చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఈ- నామ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేసి ప్రధానమంత్రి చేతుల మీదుగా ఉత్తమ సేవలకు ఎక్స్ లెన్సీ అవార్డు పొందిన కేసముద్రం మార్కెట్ లో వ్యవసాయ ఉత్పత్తులన్నీ ఆటంకాలు లేకుండా కొనుగోళ్లు చేసే విధంగా చర్యలు తీసుకుని రైతులకు ఇబ్బందులు కలగకుండా, మార్కెట్ ప్రతిష్ట మసకబారకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. ఈ విషయంపై కేసముద్రం మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అమరలింగేశ్వరరావు మాట్లాడుతూ మార్కెట్ బయట వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా కట్టడి చేస్తామని, మిర్చి కొనుగోళ్లు ప్రారంభించాలని వ్యాపారులు ఇచ్చిన విజ్ఞప్తి మేరకు ఒకటి రెండు రోజుల్లో మార్కెట్ కమిటీ పాలకమండలి సమావేశం ముందు పెట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఆపతికి బయట అమ్ముకుంటున్నా: రాజు రైతు వెంకటాపురం

కేసముద్రం మార్కెట్ల మిర్చికొనుడు బందు పెట్టిండ్లు. కాలం నెత్తిమీదకు వత్తాంది. నిరుడు ఎవుసం కోసం తెచ్చిన అప్పులు తీర్చాలే. ఇప్పుడు పెట్టుబడి కోసం పండించిన మిర్చి పంటను అమ్ముకోవాల్సిందే. మార్కెట్ లో మిర్చికొనుడు బందు పెట్టుడు వల్ల ఆపతి తీసుకో తీర్చుకోవడానికి బయట షావుకారికి అమ్ముకుంటున్నానని నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రాజు అనే రైతు చెప్పాడు.

మిర్చి కొనుగోళ్లు ప్రారంభించాలి: వ్యాపారులు

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోలు చేయడానికి తాము సిద్ధమని, పాలకమండలి, అధికారులు స్పందించి మార్కెట్లో మిర్చి కొనుగోలు ప్రారంభించాలని మిర్చి సెక్షన్ వ్యాపారులు మంగళవారం మార్కెట్ కార్యదర్శి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ మార్కెట్లో సమస్యలు ఏవైనా తలెత్తితే సమిష్టిగా పరిష్కరించి, నిర్వాహనకు ఆటంకం కలగకుండా చూడాలని మార్కెట్ అధికారులను కోరినట్టు చెప్పారు.