గెలుపు పై ఎవరి ధీమా వారిది

గెలుపు పై ఎవరి ధీమా వారిది

ముద్ర.కొల్లాపూర్:-అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఆదివారం ప్రారంభమవుతుండంతో నియోజకవర్గంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నాయకులు కార్యకర్తలు గెలుపుపై ఎవరి ధీమాపై వారు ఉన్నారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో నిలిచారు. నామినేషన్ వేసిన నాటి నుంచి ఇరువురు అభ్యర్థులు వారి అనుచరులు నియోజకవర్గంలోని గ్రామాలలో పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామాలలో చేసిన అభివృద్ధి ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు,మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించి ప్రచారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పొందుపరిచిన ఆరు గ్యారెంటీలను ఓటర్లకు వివరిస్తూ, బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలకు వివరించారు.అంతేకాక ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శనాస్త్రాలు చేసుకున్నారు. బిజెపి పార్టీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క కు ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందోనని  రేపటి కౌంటింగ్ కొరకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గెలుపు, ఓటమి ల  పై బెట్టింగులు...

ప్రధాన పార్టీ అభ్యర్థులైన బీరం హర్షవర్ధన్ రెడ్డి, జుపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా గెలుస్తారని నియోజకవర్గంలోని పలు గ్రామాలలో  ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు లక్షల రూపాయలలో బెట్టింగులు కాస్తున్నారు.అంతేకాక గెలుపు ఓటమితో సంబంధం లేకుండా గ్రామాల వారిగా తమ పార్టీకే మెజారిటీ వస్తుందని లక్ష రూపాయల లో బెట్టింగ్లు పెట్టడం విస్మయం కలిగిస్తుంది. ఇప్పటికే ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చుకాగా మళ్లీ బెట్టింగ్ల పేరుతో పందాలు కాయడంతో ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఆదివారం 11 గంటల లోపు ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారో బహిర్గతం అవుతుంది. గెలిచినవారు విందులు వినోదాల తో సంబరాలు చేసుకోవడానికి సన్నద్ధమవుతుండగా, ఓడిన వారు కూడా బాధను మరిచిపోవటానికి తాగక తప్పదని అనుకుంటున్నారు.