ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయండి

ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయండి
  • ప్రజలు గర్వపడేలా అభివృద్ధి చేస్తున్నాం
  • అభివృద్ధిని అడ్డుకోవద్దు
  • మరో 132 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నాం
  • మేయర్ వై సునీల్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పై గోనె ప్రకాష్ రావు వ్యాఖ్యలు అర్థరహితం అని అతని దగ్గర ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసుకోవచ్చని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అనాలోచిత వ్యాఖ్యలతో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని అన్నారు. ఆరోపణలు చేసే వారు ఎవరైనా నగరంలో పర్యటిస్తే అభివృద్ధి కనబడుతుందని అన్నారు.  వినోద్ కుమార్ కిరాయి చెల్లిస్తూ కరీంనగర్ లో నివాసం ఉంటున్నారని, సొంత బంధువుల ఇంట్లో ఉంటే కూడా ఇంటి అద్దెను చెల్లించిన వ్యక్తిత్వం వినోద్ కుమార్ దని తెలిపారు. 2012 లో సొంతంగా ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి పాత నివాసాన్ని అమ్మకానికి పెట్టి 370 గజాల్లో అన్ని అనుమతులతో కొత్త ఇల్లు నిర్మించుకున్నానని స్పష్టం చేశారు. అలాంటి నాపై కూడా అసత్య ప్రచారాలు చేయడం సరికాదని హెచ్చరించారు.  

దిగజారుడు మాటలు మాట్లాడుతూ ప్రజల్లో చులకన కావద్దని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరి సమాన వాటాలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సహకారంతో నగరానికి స్మార్ట్ సిటీ హోదా దక్కి అతి తక్కువ కాలవ్యవధిలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. నగర ప్రజలకు ప్రతిరోజు మంచినీటిని సరఫరా చేయడం గర్వకారణం అన్నారు. మరో 132 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన జీవో తేవడం మంత్రి గంగుల కమలాకర్ సేవా తత్వానికి నిదర్శనం అన్నారు. నగరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు మరో నూట ముప్పై కోట్ల రూపాయల నిధులతో విలీన గ్రామాలతో సహా నగరవ్యాప్తంగా నిధులను కేటాయించి పెండింగ్ లో ఉన్న అన్ని అభివృద్ధి పనులు మూడు మాసాల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.