ధాన్యం కొనుగోలులో రైతులకు మిల్లర్లు సత్వర సహకారం అందించాలి

ధాన్యం కొనుగోలులో రైతులకు మిల్లర్లు సత్వర సహకారం అందించాలి

జిల్లా కలెక్టర్ పమేళా సత్పథి

భువనగిరి ముద్ర న్యూస్: మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్ లోడ్  చేసుకోవాలని, ప్రభుత్వం రైతులకు అందించే లబ్దిని నెరవేర్చాలని  జిల్లా కలెక్టరు పమేలా సత్పథి మిల్లర్ల ప్రతినిధులకు సూచించారు. గురువారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మిల్లర్లు ధాన్యం అన్ లోడ్  చేసుకునే అంశాలపై మిల్లర్లతో ఆమె సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లుకు వచ్చిన ధాన్యం లారీలను వెంట వెంటనే అన్లోడ్ అయ్యేలా చూడాలని, అందుకు అవసరమైన చోట హమాలీలను ఎక్కువ సంఖ్యలో నియమించుకోవాలని, ధాన్యం అన్లోడు కాగానే సంబంధిత ట్రక్ చిట్స్ ఒపిఎంఎస్ లో అప్లోడ్ చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో డబ్బులు వారి ఖాతాలలో జమ అయ్యేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ధృవీకరించిన ధాన్యం క్వాలిటీని పరిగణలోనికి తీసుకోవాలని, స్టాక్ ప్రకారం ప్రణాళికతో గోదాములలో అన్లోడ్ చేపట్టాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకొని ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న లబ్దిని నెరవేర్చాలని తెలిపారు.

ధాన్యం దిగుమతి కొరకు క్లోజ్డ్ ప్లేస్ గోదామ్ ముందస్తుగా అనుమతి తీసుకోవాలని,  అదే విధంగా ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ యాసంగి 2022-23 కోసం ఏ ఏ మిల్లర్లు పాల్గొంటారో ఆ మిల్లుల వివరాలు మిల్లర్ల అసోసియేషన్ వ్రాత పూర్వకముగా వ్రాసి ఇవ్వాలని, మిల్లర్లు దిగుమతి చేసుకున్న ధాన్యం విషయంలో ఏమైనా అవకతవకలకు పాల్పడితే ఆ మిల్లుపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మిల్లును డిఫాల్ట్ మిల్లుగా పరిగణించి ప్రభుత్వ నిభందనల మేరకు తగిన చర్య తీసుకోబడుతాయని తెలిపారు.  ధాన్యం దిగుమతికి మిల్లర్లు పూర్తిగా సహకరించాలని ఆమె కోరారు. గత ఖరీఫ్ 2021-22 లో 100 శాతం, రబీ 2021- 22 లో 97 శాతం కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ సాధించి  రాష్ట్రంలో జిల్లాను రెండవ స్థానంలో నిలిపినందుకు మిల్లర్లను, అధికారులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు అభినందించారు.

మిల్లర్లతో జరిగిన సమావేశంలో జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టరు డి .శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, సివిల్ సప్లయ్ డిఎం గోపీకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ, జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, జిల్లా సరఫరాల అధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా మిల్లర్ల అసోసియేషన్ కార్యదర్శి పసునూరి నాగభూషణం, కోశాధికారి వెంకటేశం, ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.