రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

 గ్రామంలో విషాదం..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కోరుట్ల మండలంలోని కోరుట్ల అనుబంధ గ్రామమైన ఏకిన్ పూర్, సిరికొండ గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని నాగులపేట గ్రామానికి చెందిన బలుసు రమేష్ (42) సిరికొండ గ్రామానికి తన తల్లితో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కోళ్లలోడు గల వాహనము బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో రమేష్ తల భాగం సగానికి పైగా నుజ్జునుజ్జయింది. దీంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్ తల్లికి స్వల్ప గాయాలయ్యాయి.

మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కళ్ళ ఎదుటే కన్న కొడుకు మృతి చెందడంతో తల్లి రోధన వర్ణనాతీతం. కన్న కొడుకు జాతర రోజే శవమై వచ్చాడు.మండలంలోని నాగుల పేట గ్రామంలో నాగులమ్మ అంటే అనన్యమైన భక్తి విశేషాలు ఉంటాయి. ఈ క్రమంలో నాగుల పేట గ్రామంలో నాగులమ్మ జాతర ఆదివారం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఇంట చుట్టాలతో జాతరకు సిద్ధమవుతున్న వేళ గ్రామానికి చెందిన రమేష్ మృతి వార్త స్థానికంగా పెను విషాదం నింపింది. జాతరలో పాల్గొన్న రమేష్ ఈ విధంగా మృత్యువాత పడడంతో ఒక్కసారిగా తీవ్ర విషాదానికి గురయ్యారు. పిల్లలు జాతరకు వెళ్లామని సిద్ధమవుతున్న వేళ తండ్రి శవమై రావడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.