ఏఏంసీ పదవి తెచ్చిన పంచాయతీ

ఏఏంసీ పదవి తెచ్చిన పంచాయతీ
  • రెండుగా చీలీన ముస్తాబాద్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు
  • పోటాపోటీ సమావేశాలు.. జిల్లా నాయకత్వంపై అసంతృప్తి
  • అసంతృప్తులు చల్లేర్చందుకు   గోపన్న, శరతన్న.. మధ్యలో ఆగన్న.. 
  • ఆగిన రాజన్నసిరిసిల్ల జిల్లా ఏఏంసీ పదవుల జాబితా

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఏఏంసీ పదవులు బీఆర్ఎస్ అధిష్టానానికి పంచాయతీ తెచ్చి పెట్టింది. జిల్లాలో నాలుగు ఏఏంసీ చైర్మన్ పోస్టుల పేర్లను సెలక్ట్ చేయడంతో ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ వర్గాల్లో ఒక్కసారిగా అసంతృప్తి నెలకొంది. జనరల్ స్థానంలో బీసీకి ఇవ్వడం ఏంటని పేర్కొంటూ ఒక వర్గం సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ మండలా ముఖ్య నేతల మీద ఎర్ర జెండా ఎగురవేశారు.వారి తీరును తప్పుబట్టారు. మంత్రి కేటీఆర్ను కల్వకుంట్ల గోపాల్ రావు, జనగామా శరత్రావు తప్పుదారి పట్టించి.. పదవులు ఉన్న వారికే పదవులు ఇప్పిస్తున్నరని, ఉద్యమకారులకు విలువ ఇవ్వడం లేదని వాపోయారు. దీనికి తోడు మరో వర్గం సమావేశం ఏర్పాటు చేసి తాము పార్టీ లైన్లో పని చేస్తామని, కొండ శ్రీనివాస్కే ఏఏంసీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ తీర్మాణం చేసి సంతకాలు సేకరించారు.

ముస్తాబాద్ మండలంలో పోటా పోటీగా ఎవరికి వారు బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించి తమ డిమాండ్లు ప్రకటించడంతో బీఆర్ఎస్ జిల్లా నాయకత్వం రంగ ప్రవేశం చేసి అసంతృప్తులు చల్లర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. మంత్రి కేటీఆర్ ఆమెరికా పర్యటనలో ఉండగా ముస్తాబాద్ బీఆర్ఎస్ చీలీకలు ఏర్పడటం.. జిల్లానాయకులు, మండల నాయకులు ఎవరు చెప్పిన వినకపోవడంతో తాత్కాలికంగా ఏఏంసీ చైర్మన్ పదవుల జబితా విడుదలను నిలుపుదల చేశారు. మంత్రి కేటీఆర్ వచ్చాకనే సమస్య సద్దుమనిగించేందుకు జిల్లా నాయకత్వం నిర్ణయించింది. కేటీఆర్ బాబాయ్ గోపాల్రావు కొండ శ్రీనివాస్ పేరు తీసుకురావడం మూలంగానే ఇదంత జరిగిందని ఒక వర్గం పేర్కొంటుండగా.. మూడు ఏఏంసీ చైర్మన్ పదవుల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి రెండు బీసీ సామాజిక వర్గానికి మంత్రి కేటీఆర్ నిర్ణయం మేరకు ఇచ్చారని పార్టీ ముఖ్యులు చెబతున్నారు. శనివారం కూడా ముస్తాబాద్ మండలంలో నర్సింహారెడ్డి, రమేశ్ రెడ్డి, సంతోష్ రావు, నల్ల నర్సయ్య, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

జిల్లా నాయకత్వం సమన్వయ లోపం.. సమస్య జఠిలం

రాజన్నసిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ నాయకుల సమన్వయ లోపంతోనే ముస్తాబాద్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విబేధాలు, పార్టీ చీలిక సమస్య జఠిలమైనట్లు ముస్తాబాద్ లో చర్చ కొనసాగుతుంది. నెల రోజులుగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు సమస్య విన్నవించిన.. పట్టించుకోలేదని, వాట్సప్ చాట్లను ఒక వర్గం బహిర్గతం చేసింది. ముస్తాబాద్ మండల ముఖ్య లీడర్లతోనే సమస్య పరిష్కరించుకోవాలని సూచించి.. సమస్య పెద్దగా ఐనక తోట ఆగయ్య వచ్చి సమస్య పరిష్కారం చేసుకోవాలంటూ.. సమావేశాలు పెడుతున్నడంటూ వాపోయారు. ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, పదవులు ఉన్నవారికే రెండేసి పదవులు ఇస్తున్నరని ముస్తాబాద్ మండల నాయకులు పలువురు ముద్రకు తెలిపారు. మంత్రి కేటీఆర్ కోసమే తాము ఇప్పటికి పని చేస్తామని, బీఆర్ఎస్ ముఖ్య లీడర్ల వల్లే సమస్యలు ఏర్పడుతున్నయన్నారు.