రామగుండం నియోజకవర్గం అభివృద్దే నా లక్ష్యం

రామగుండం నియోజకవర్గం అభివృద్దే నా లక్ష్యం
  • నియోజకవర్గంలో ఆర్ అండ్ బి రోడ్లను ఏర్పాటు చెయ్యాలి
  • ప్రత్యేక నిధులను మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలి
    సుమారు రూ.25 కోట్లతో ప్రతిపాదనలు
  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వినతి

ముద్ర, గోదావరిఖని టౌన్:రామగుండం నియోజకవర్గం అభివృద్దే నా లక్ష్యమని, నా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కృషి చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కలసి వినతి పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మాట్లాడుతూ ఎల్కలపల్లి నుంచి కన్నాల, కుక్కలగూడూరు నుంచి తక్కలపల్లి, రామగుండం నుంచి రైల్వే స్టేషన్, పోట్యాల నుంచి మర్రిపల్లి, కుక్కలగూడూరు నుంచి ఈసంపేట, ఎంపిడివో కార్యాలయం నుండి రామగుండం, పెద్దంపేట వరకు సుమారు రూ.25 కోట్లతో అంతర్గం, పాలకుర్తి, రామగుండంకు సంబంధించిన ఆర్ అండ్ బి రోడ్లను నిర్మించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూరగా దీనికి ఆయన సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

దీంతో రామగుండం నియోజకవర్గంలో ఆర్ అండ్ బి రోడ్లను పూర్తి స్థాయిలో చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏలా అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారో అలాగే రామగుండం నియోజకవర్గంలో కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటికే రామగుండం కార్పొరేషన్ కు ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరడం జరిగిందన్నారు. పూర్తిస్థాయిలో రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఆర్ అండ్ బి రోడ్లతో సుందరీకరణగా మారుతుందన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గానికి ఇతర శాఖలకు సంబంధించిన నిధులు మంజూరు చేయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామన్నారు.