విద్యార్థినిపై అత్యాచారం, హత్య?!

విద్యార్థినిపై అత్యాచారం, హత్య?!
  • ప.బె.లో ఆదివాసీలు, స్థానికుల ఆందోళనలు
  • మమతా ప్రభుత్వం, పోలీసులపై ప్రతిపక్షాల విమర్శలు

కోల్​కత్తా: శుక్రవారం పశ్చిమ బెంగాల్​లోని కలియాగంజ్​ సహబ్​ఠాణా పరిధిలోని ఆదివాసీ విద్యార్థిని రేప్​ చేసి హత్య ఘటన చిలికి చిలికి గాలి వానలా మారింది. ఆ ప్రాంతమంతా స్థానికులు, ఆదివాసీ సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నిరసనలు, ఆందోళనలతో హోరెత్తింది.  ఇంటి నుంచి వెళ్ళిన విద్యార్థిని తిరిగి రాలేదని స్థానికులు, కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం చెరువు ఒడ్డున విద్యార్థిని శవం లభించింది. విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్యచేశారని స్థానిక ఆదివాసీలు ఆరోపించి ఆందోళనలకు దిగారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్​లోని ఉత్తర దినాజ్​పూర్​లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనను నిరసిస్తూ స్థానిక ఆదివాసీలు పెద్ద ఎత్తున కలియాగాంజ్​లోని సహబ్​ఠాటాలో నిరసనలు, ఆందోళనలకు దిగగా ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.

ఆందోళనలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై రాళ్ళదాడులకు పాల్పడ్డారు. పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. అయినా అల్లర్లు సద్దుమణగకపోవడంతో రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండడంతో మరిన్ని పోలీసు బలగాలను రాష్ర్టప్రభుత్వం రంగలోకి దింపి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.  మరోవైపు ఈ అత్యాచారం, హత్య ఘటనపై బెంగాల్​ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్​ మజూమ్​దార్​, ప్రతిపక్ష నేత శుభేంద్రు అధికారిలు ప్రభుత్వంపై, పోలీసు వ్యవస్థపై ఆరోపణలు, విమర్శలకు దిగారు. పశ్చిమ బెంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పాలనలో రౌడీలకు, గ్యాంగ్​స్టర్ల బలం పెంచేలా వ్యవహరిస్తున్నారని శుభేంద్రు ఆరోపించారు.  బాలిక హత్య కేసు పాపం పూర్తిగా మమతా సర్కారుదేనని బీజేపీ అధ్యక్షుడు సుకాంత్​ ఆరోపించారు. కాగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.