రాత్రి 10.30 కల్లా తెలంగాణలో షాపుల బంద్...!

రాత్రి 10.30 కల్లా తెలంగాణలో షాపుల బంద్...!
  • రాత్రి 10.30 - 11.00 కల్లా షాపులు మూసేయాలంటూ పోలీసు శాఖ ఆదేశాలు
  • రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌పై సమీక్ష అనంతరం సీఎం సూచన మేరకు ఆదేశాల విడుదల
  • కొత్త నిబంధనలపై వ్యాపారుల అసహనం

ముద్ర,తెలంగాణ:- రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దృష్ట్యా తెలంగాణ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై తెలంగాణలోని షాపులు, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10.30 -11.00 కల్లా కట్టేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల కాలంలో నేరాల తీవ్రత పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాత్రుళ్లు అనవసరంగా వీధుల్లో తిరగొద్దని ప్రజలకు పోలీసులు సూచించారు. తెలియని వారికి లిఫ్ట్ ఇవ్వొద్దని అన్నారు. రాత్రుళ్లు పబ్లిక్ ప్లేసుల్లో మద్యం తాగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

కాగా, పోలీసుల ఆదేశాలపై వ్యాపారులు, ప్రజలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని నైట్‌లైఫ్‌పై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. చార్మినార్ పరిసరాల్లో అర్ధరాత్రి వరకూ జనాల సందడి ఉంటుందని స్థానిక వ్యాపారి ఒకరు పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వం నేరాలను నియంత్రించాలి కానీ ఈ దిశగా చేపట్టే చర్యలతో ప్రజలకు నష్టం కలగకూడదు’’ అని పేర్కొన్నారు. నగర ప్రజల అభిరుచులు మారుతున్నాయని, సాయంత్రం వేళల్లో కుటుంబంతో సహా విహరించేందుకు ఆసక్తి చూపుతున్నారని మరో వ్యాపారి అభిప్రాయపడ్డారు. షాపులు మూసేసే సమయంలో అనేక మంది కస్టమర్లు హడావుడిగా షాపులకు వస్తుంటారని, కాబట్టి అర్ధరాత్రి వరకూ షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతించాలని అన్నారు.