సింగరేణి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు..

సింగరేణి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు..

కార్మికులను అయోమయానికి గురి చేస్తున్నారు.. 
బీజేపీ జిల్లా అధ్యక్షుడు యుగేందర్..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:
సింగరేణి వ్యవస్థను నిర్వీర్యపరుస్తూ కార్మికులను అయోమయానికి గురి చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్ కు కార్మికులు, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కన్నం యుగేందర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థను బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం లూటీ చేస్తుందని, కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. గతంలో లక్ష పై చిలుకు ఉద్యోగాలతో కళకళలాడిన సింగరేణి సంస్థ నేడు కేవలం 40 వేల కార్మికులతో వెలవెలబోతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండకూడదని, యాంత్రీకరణ విధానాలు ఉండకూడదని, గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో కార్మీకులు, ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ ల పేరుతో కార్మికుల శక్తిని నిర్వీర్యపరచాలని, యంత్రాల ద్వారా వెలికితీత పనులు చేపట్టి సింగరేణి సంస్థలో కార్మికుల తొలగింపు చేయడం కార్మికుల జీవితాలను, కుటుంబాలను ఆగం చేయడమేనని అన్నారు. అదేవిధంగా సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేస్తారని కేంద్ర ప్రభుత్వంపై నెపం పెడుతూ రాజకీయ పబ్బం కోసం సింగరేణి ప్రాంతాలలో ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. కనీసం అవగాహన లేకుండా సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతంగా ఉందని అలాంటప్పుడు సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేయడం సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్ కు విచ్చేసినటువంటి సందర్భంలో సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో ప్రవేటీకరణ చేయబోమని స్పష్టంగా తెలపడం జరిగిందని గుర్తు చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేస్తున్నట్లుగా ప్రకటన చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయ అవసరాల కోసం రానున్న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని కార్మికులను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దొంగల రాజేందర్, బట్టు రవి, ఉనుకోండ రామకృష్ణ, కాంబాల రాజయ్య, కుమార్ గీసా సంపత్, ఇచ్చంతుల విష్ణు, ఐలుకోమురయ్య తదితరులు పాల్గొన్నారు.