ప్రగతిభవన్​ ఇక ప్రజాభవన్​

ప్రగతిభవన్​ ఇక ప్రజాభవన్​
  • ​అందులో సామాన్యులందరికీ అనుమతి
  • సీపీఐ, సీపీఎం, టీజేఎస్ తో కలిసి పని చేస్తాం
  • ప్రతిపక్ష సూచనలూ పరిగణలోకి తీసుకుంటాం
  • కాంగ్రెస్​ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం
  • టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :ప్రగతిభవన్​ను త్వరలోనే డాక్టర్​ బాబాసాహెబ్​ అంబేడ్కర్​ ప్రజాభవన్ గా మారుస్తామని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు.గత ప్రభుత్వ పాలనలో మాదిరిగా కాకుండా ఇకపై ప్రగతిభవన్​లో సామాన్యులు వచ్చేందుకూ అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ సాధించిన తర్వాత గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన రేవంత్​ రెడ్డి ఇకపై సచివాలయం గేట్లు అందరి కోసం తెరుచుకుంటాయన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతు తెలిపిన సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలతో పాటు సీపీఎం, ఎంఐఎం పార్టీల సలహాలు సూచనలు తీసుకుని పాలన కొనసాగిస్తామని చెప్పారు. అలాగే ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్​ఎస్​ సూచనలనూ పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో శాంతియుత, ప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తామని వివరించారు. కాంగ్రెస్ సాధించిన విజయాన్ని తెలంగాణ ఉద్యమ అమరవీరులకు అంకితమని చెప్పారు. 2009లో సరిగ్గా ఇదే రోజు శ్రీకాంతచారి.. తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకోగా, ఇప్పుడు ఇదే రోజు కాంగ్రెస్​ రాష్ట్రంలో గెలిచిందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కాంగ్రెస్​ ప్రయత్నిస్తుందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్​ ప్రకటించిన గ్యారంటీలు, ఇచ్చిన హామీలను నెరువేరుస్తామన్న ఆయన కాంగ్రెస్​ గెలుపునకు కృషి చేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఙతలు తెలిపారు.