తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది మార్పు - కారణం ఇదే..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది మార్పు - కారణం ఇదే..!

ముద్ర,తెలంగాణ:- సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చి వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసిన తర్వాత భద్రతా సిబ్బంది మార్పు ప్రక్రియ జరిగింది. తన వ్యక్తిగత సమాచారం బయటకు తెలియడంతో సీఎంవో అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో ఏం జరిగిందని అధికారులు ఆరా తీశారు. ఇప్పుడు ఉన్న భద్రతా సిబ్బందిలో కొందరు గతంలో కేసీఆర్ వద్ద పనిచేశారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి వ్యక్తిగత, అధికారిక సమాచారం బయటకు తెలిసింది.

రేవంత్ వ్యక్తిగత సమాచారం లీక్ కావడానికి కేసీఆర్ వద్ద పనిచేసిన భద్రతా సిబ్బందినే కారణమని గుర్తించారు. దీంతో మొత్తం సీఎం భద్రతా సిబ్బందిని మార్చి కొత్త వారిని నియమించారు. సీఎం రేవంత్ వెంట ఉండే పోలీసు సిబ్బందిని కూడా మార్చారు. సీఎం రేవంత్ ఇంటి వద్ద సెక్యూరిటీని కూడా మార్చారు. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల మాజీ సీఎం కేసీఆర్ నియమించిన అధికారులను మార్పిడి చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తన భద్రతా సిబ్బందిని కూడా మార్చడం జరిగింది.