మమ్మల్ని ఎదుర్కొనే సత్తా వారికి లేదు

బీఆర్‌‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: తమ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్, బీజేపీలకు లేదని బీఆర్‌‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేశ్‌ అధ్యక్షత వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రజల సామాజిక అవసరాలను గుర్తించి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్‌‌ దేశంలో ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు.

అలాంటి సీఎంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి సంస్కృతిని మరిచి విమర్శలు చేయడం సరికాదన్నారు. పార్టీ అంటే ఓ కుటుంబం.. కుటుంబంలో వచ్చే కలహాలను సమష్టిగా చర్చించుకుని ఒక తాటిపై నడిచి రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ జెండాను ఎగరవేసేందుకు కార్యకర్తలు కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, ఎంపీపీ రేఖ గట్టయ్య, వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి, ఆకుల కుమార్, తాటికొండ సురేశ్‌కుమార్, కేశిరెడ్డి మనోజ్ రెడ్డి, అక్కనపల్లి బాలరాజు, నాగరబోయిన శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.