తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నాం..

తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నాం..
  •  అమరులను స్మరించుకోవడం మన బాధ్యత
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు
  • ఘనంగా అమరుల సంస్మరణ దినోత్సవం

ముద్ర ప్రతినిధి, జనగామ: తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇస్తే వచ్చింది కాదు.. నాటి ఉద్యమ నేత, నేటి సీఎం కేసీఆర్‌‌ నాయకత్వంలో పోరాడి సాధించుకున్నామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్‌‌ సి.హెచ్‌ శివలింగయ్య అధ్యక్షతవ వహించగా.. మంత్రి దయాకర్‌‌రావు, జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా స్వరాష్ట్రం కోసం అసువులు బాసిన అమరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తాము ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కాంగ్రెస్‌ లీడర్లు అనడం సరికాదని, ఎవరి దయాదాక్షిణ్యాలతో స్వరాష్ట్రం రాలేదని కేసీఆర్‌‌ పోరాటం, అమరుల త్యాగాలతో తెలంగాణ వచ్చిందన్నారు. 1972లో తొలి దశ ఉద్యమంలో 369 మంది, మళి దశ పోరాటంలో 1200 మందిని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్‌ పార్టీ కాదా అని మంత్రి ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం గాంధీ వల్ల వచ్చింది అని చెప్పుకునే కాంగ్రెస్‌ లీడర్లు.. తెలంగాణ కూడా కేసీఆర్‌‌ వల్లే వచ్చిందని గుర్తించాలన్నారు.

స్వాతంత్ర్యం బ్రిటీష్‌ వారి వల్ల వచ్చిందంటే కాంగ్రెస్‌ వారు ఒప్పకుంటే.. తాము కూడా కాంగ్రెస్‌ వల్లే స్వరాష్ట్రం వచ్చిందని ఒప్పకుంటామని చమత్కరించారు. అసలు కాంగ్రెస్‌కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హతలేదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌‌ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు జనగామ ప్రాంతం నీటి కోసం అల్లాడేదన్నారు. కానీ ఇప్పుడు సస్యశ్యామలంగా మారిందంటే అది కేసీఆర్‌‌ పుణ్యమే అన్నారు. నాడు బతుకు దెరువు కోసం వెళ్లిన ఎన్నో కుటుంబాలు ఇప్పుడు సొంత ఊళ్లకు తిరిగి వచ్చి సంతోషంగా బతుకుతున్నాయన్నారు. తాము అధికారంలో వచ్చాక ప్రతీ కుటుంబానికి ఏదో పథకం ద్వారా మేలు జరిగిందన్నారు.

ఇక ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు, గృహలక్ష్మి, కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకంలో అమరుల కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు తాను కలెక్టర్‌‌కు ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్‌ దేశాయ్‌, రోహిత్‌ సింగ్‌ (రెవెన్యూ), డీసీపీ సీతారాం, గ్రంథాలయ చైర్మన్‌ కృష్ణారెడ్డి, అమరుడు శ్రీకాంత్ చారి తండ్రి వెంకటారి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో... జనగామ జడ్పీ ఆఫీస్‌లో కూడా అమరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమరుల త్యాగాలతో తెలంగాణ సిద్దించిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, జడ్పీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు, పీఎసీఎస్‌ చైర్మన్, జిల్లా ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.