బిఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత

బిఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత
  • భూ కబ్జాలు, డ్రగ్స్, కమిషన్లతో అల్లాడుతున్న కరీంనగర్
  • వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి
  • ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చవద్దు
  • కాసులకు అమ్ముడుపోయే పార్టీ కాంగ్రెస్
  • బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి సీఎం 
  • బిజెపి అభ్యర్ధి బండి సంజయ్ 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపట్ల తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారని ఆరోపించారు. కరీంనగర్ లోనూ సర్కార్ వ్యతిరేక ఓట్లను చీల్చే కుట్ర జరుగుతోందన్నారు. కరీంనగర్ ప్రజలెవరూ మోసపోవద్దని, బీఆర్ఎస్ పాలనలో భూకబ్జాలు, డ్రగ్స్, కమీషన్ల దందాతో కరీంనగర్ అల్లాడుతున్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీల్లోని పేదవర్గాలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.

రెండోరోజు పాదయాత్రలో భాగంగా 6, 29, 30 పాతబజార్ శివాలయం నుండి కాపువాడ, మంగలివాడ, మారుతినగర్ లో బండి సంజయ్ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. ప్రతిరోజు ప్రజలను కలుస్తున్నా. వాతావరణం పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉంది. బీఆర్ఎస్ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అంతకంటే రెట్టింపు వ్యతిరేకత గంగుల కమలాకర్ పై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే అమ్ముడుపోతారు. కేసీఆరే స్వయంగా పైసలిచ్చి కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోవడం ఖాయమని తేలిపోయిందన్నారు. బీజేపీకి ఓటేసి అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బలహీనవర్గాల్లోని పేద వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు.

 గంగుల ముందు మీ స్థానమేందో తెలుసుకో మీకు చివరిదాకా బి.ఫాం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. గంగులను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే యత్నిస్తున్నారని ఆరోపించారు. భూకబ్జాలు, డ్రగ్స్, గంజాయి, కమీషన్ల దందాతో కరీంనగర్ ను సర్వనాశనం చేశారు. కరీంనగర్ ను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రజలంతా బీజేపీకి మద్దతిచ్చి గెలిపించాలని ప్రజలను కోరారు.