అత్యాధునిక టెక్నాలజీ సిఈఐఅర్ అప్లికేషన్ ద్వారా ఫోన్ ఆచూకీ తెలుసుకోవడం చాలా సులభం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

అత్యాధునిక టెక్నాలజీ సిఈఐఅర్ అప్లికేషన్ ద్వారా ఫోన్ ఆచూకీ తెలుసుకోవడం చాలా సులభం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ముద్ర సిరిసిల్ల టౌన్ : దొంగతనానికి లేదా పోయిన మొబైల్ ని తిరిగి పొందడానికి సిఈఐఅర్ అప్లికేషన్ ఎంతో దోహదపడుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు.ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లో సిబ్బందికి,అధికారులకు సిఈఐఅర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) అప్లికేషన్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దొంగిలించబడిన ఫోన్ లను వెతికి పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుంది అని అయితే  కొత్తగా ప్రవేశ పెట్టిన సిఈఐఅర్ అనే అప్లికేషన్  ద్వారా ఫోన్  ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరికి గురైనా అట్టి ఫోన్  లను వెతికి పట్టుకోవడానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. మొబైల్ ఫోన్ పోతే సంబంధిత పోలీస్ స్టేషన్ లో లేదా మీ సేవ ద్వారా పిర్యాదు చేయాలని సూచించారు. అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు సిఈఐఅర్ అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా ఐఎంఈఐ నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు. సిఈఐఅర్ అప్లికేషన్ గురించి పోలీసు అధికారులు సిబ్బంది గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించడం జరిగిందన్నారు.

సిఈఐఅర్ ఎలా పనిచేస్తుంది:-

టెలికాం మంత్రిత్వ శాఖా ఆద్వర్యంలో  సిఈఐఅర్ ప్రవేశపెట్టింది.ఇందుకోసం www.ceir.gov.in వెబ్ సైట్ లో లాగిన్ కావాలి. అందులో రెక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది దానిపై క్లిక్ చేయాలి పోయిన ఫోన్  లోని నంబర్లు,ఐఏంఇఐ నంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడి, ఓటిపి కోసం మరో ఫోన్  నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడి నెంబర్ వస్తుంది సంబంధిత ఐడి ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొబైల్ ఏ కంపెనీ అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఫోన్ పని చేయకుండా చేస్తుంది. ఫోన్  దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. ఐడి నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. ఫోన్  పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలని, సిఈఐఅర్ అప్లికేషన్  సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సిఈఐఅర్ అప్లికేషన్లో  సమాచారం నమోదు చేస్తే పోయిన మొబైల్ ఫోన్ త్వరగా దొరకడానికి అవకాశం ఉంటుంది.