కాంగ్రెస్ లో మార్పు మొదలైంది! మండలాలకు కొత్త అధ్యక్షుల నియామకం

కాంగ్రెస్ లో మార్పు మొదలైంది! మండలాలకు కొత్త అధ్యక్షుల నియామకం

కేసముద్రం, ముద్ర: మానుకోట కాంగ్రెస్ పార్టీ లో మార్పు మొదలైంది. మహబూబాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల అధ్యక్షులతో పాటు మహబూబాబాద్ అర్బన్ కమిటీ కి నూతన అధ్యక్షులను నియమించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మండల పార్టీ అధ్యక్షుల మార్పు పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని భావిస్తున్నారు. మహబూబాబాద్ అర్బన్ అధ్యక్షుడిగా గణపురం అంజయ్య, రూరల్ అధ్యక్షుడిగా మిట్టకంటి రామ్ రెడ్డి, కేసముద్రం అధ్యక్షుడిగా అల్లం నాగేశ్వరరావు, గూడూరు అధ్యక్షుడిగా నునావత్ రమేష్, నెల్లికుదురు అధ్యక్షుడిగా గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, ఇనుగుర్తి అధ్యక్షుడిగా కూరెళ్ళి సతీష్ ను నియమిస్తూ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి సంస్థాగత మార్పుకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెసులో వర్గ విభేదాలకు తావు లేకుండా ఉండేందుకు, కొత్తగా మండలాల అధ్యక్షులను నియమించడానికి టిపిసిసి గత కొద్ది నెలల క్రితం క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ జరిపి ఆమేరకే మండలాలకు అధ్యక్షులు నియామకం జరిపినట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మండల పార్టీ అధ్యక్షులు నియామకం తో కొత్త ఊపు వచ్చినట్లయ్యిందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.