ఏనాడూ తలవంచని తెలంగాణ.. నీ వల్ల తలవంచుతోంది 

ఏనాడూ తలవంచని తెలంగాణ.. నీ వల్ల తలవంచుతోంది 

హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ,  బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య తరచూ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది.  అనేక విషయాల్లో సోషల్ మీడియా వేదికగా ఇరువురు నేతలు సెటైర్లు విసురుకుంటుంటారు. అయితే తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ లో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై ఎంపీ అరవింద్ ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం లో 2014-–2018 వరకు ఒక్క మహిళ కూడా మంత్రిగా లేదన్నారు. అప్పుడు నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉన్న కవిత పార్టీలో ఆధిపత్యానికి స్పష్టమైన కారణాల వల్ల మహిళలకు కేబినెట్‌లో అవకాశం లేదని బీజేపీ ఎంపీ విమర్శించారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయి, ఆ తర్వాత నెపోటిజం కోటాలో కవిత ఎమ్మెల్సీ అయ్యారని తెలిపారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక కుట్రదారుగా రూపుదిద్దుకున్న తర్వాత, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడాలని ఆమె హఠాత్తుగా భావించడం.. ప్రజల దృష్టిని మరల్చడానికి ఆమె చేసిన వ్యర్థ ప్రయత్నం మాత్రమే అని అన్నారు. ''తెలంగాణ... మొదటి లేదా ఇటీవలి ఉద్యమంలో ఎవరికీ తలవంచలేదు, కానీ ఇప్పుడు మీ ప్రమేయం ( కవిత) చూసి దేశం ముందు సిగ్గుతో తెలంగాణ తలవంచుతోంది''అంటూ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు.