తోపులాటలు, అరెస్టులతో కొనసాగిన దశాబ్ది దగా

తోపులాటలు, అరెస్టులతో కొనసాగిన దశాబ్ది దగా

 కెసిఆర్ చరిత్ర హీనుడు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కాంగ్రెస్ చేపట్టిన దశాబ్ది దగా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. కెసిఆర్ 10 తలల దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకునే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. దీంతో కొన్నిచోట్ల కాంగ్రెస్ నాయకులు అరెస్టు చేశారు. చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో చేపట్టిన దశాబ్ది దగా కార్యక్రమానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దశాబ్ది ఉత్సవాల్లో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుందని ఆరోపించారు. కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా దశాబ్ది దగా కార్యక్రమం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, నిరుద్యోగుల ఉద్యోగాలు, గిరిజన, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, పోడు భూముల పట్టాల పంపిణీ లాంటి హామీలు అమలు చేయకుండా దశాబ్ది ఉత్సవాలు జరపడం ఎంతవరకు సమంజసం తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. ఏ ఆలోచనతో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో అందుకు అనుగుణంగా సామాజిక సంక్షేమ తెలంగాణ ప్రజలకు అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం కెసిఆర్ పది తలల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.