ఇథ నాల్  ప్రాజెక్టు మాకొద్దు

ఇథ నాల్  ప్రాజెక్టు మాకొద్దు
  • పాసిగామ గ్రామస్తుల భారీ ధర్నా,రాస్తారోకో
  • రహదారికి ఇరు వైపుల భారీగా నిలిచిన వాహనాలు

 వెల్గటూర్,ముద్ర: జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి గ్రామ శివారులో  ఇథనాల్  ప్రాజెక్టు నిర్మాణాన్ని క్రిబ్ కో కంపెనీ చేపట్టనుండగా మండలంలోని పాసి గామా, స్తంభంపల్లి  గ్రామస్తులు అడ్డుకున్నారు. రాష్ట్ర రహదారి పై భారీ ధర్నా రాస్తారోకో చేశారు.

వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి గ్రామ శివారులో 110 ఎకరాలలో 750 కోట్లతో ఇథనాల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అవసరమైన  లేవలింగ్ పనులను ప్రారంభిందుకోసం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  వచ్చారు. విషయం తెలుసుకున్న పాసి గామా, స్తంభంపల్లి గ్రామస్తులు భారీగా తరలి వచ్చి పనులను అడ్డుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల వెదజల్లే కాలుష్యంతో  మా ప్రాణాలతో పాటుగా జీవకోటికి ముప్పు పొంచి ఉందని  దాని నిర్మాణం మాకొద్దని  ఆందోళన చేశారు.  కమిషన్ల కోసం నాయకులు మా జీవితాలతో ఆడుకోవద్దని, దీని నిర్మాణాన్ని ఆపకుంటే ఎంతటి  ఆందోళన చేయడానికి అయినా  సిద్ధమేనని హెచ్చరించారు. రెండు గ్రామాల ప్రజలు చేసిన నిరసనతో రాష్ట్ర రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచాయి. ఒక దశలో కొందరు యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది