ఎలక్ర్టానిక్​ ఇంటర్​లాకింగ్​ మార్పే ప్రమాదానికి కారణం

ఎలక్ర్టానిక్​ ఇంటర్​లాకింగ్​ మార్పే ప్రమాదానికి కారణం
  • కారకులను గుర్తించాం..
  • సహాయక చర్యల్లో నిమగ్నం
  • బుధవారం నుండి ట్రాక్​పై రైళ్ల రాకపోకల పునరుద్ధరణ
  • కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​ వెల్లడి

ఒడిశా: ఎలక్ర్టానిక్​ ఇంటర్​లాకింగ్​తోనే ఒడిశా రైలు ప్రమాదం జరిగిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ఆదివారం స్పష్టం చేశారు. ఒడిశాలోని బాలేశ్వర్​లో ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రమాదంపై రైల్వేభద్రత బోర్డు విచారణ చేపట్టిందన్నారు. ప్రాథమిక దర్యాప్తు ద్వారా ‘ఎలక్ర్టానిక్​ ఇంటర్​లాకింగ్’ మార్పు వల్లే ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు, ప్రమాదానికి కారకులుగా నిలిచిన వారిని గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం తాము సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నామన్నారు.  మరిన్ని విషయాలను ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రమాదం వల్ల చాలా రైళ్లు రద్దయ్యాయని పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నందున బుధవారం వరకూ ట్రాక్​ను పునరుద్ధరించి లోపాలను సరిచేసుకొని ప్రయాణాలు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆదివారం ఓ ట్రాక్​ను పూర్తిగా మరమ్మత్తు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ట్రాక్‌ పునరుద్ధరణలో భాగంగా ఏడు పాకెటింగ్ యంత్రాలు, భారీ రైల్వే క్రేన్‌, నాలుగు రోడ్‌ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటల నాటికి డౌన్​ మెయిల్ లైన్​ను పునరుద్ధరించారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. భారీ జనరేటర్లు, పెద్ద లైట్లను ఉపయోగించి ట్రాక్‌ లింకింగ్‌ పనులు కొనసాగిస్తున్నారు.