జూన్ 21 నుంచి గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మెబాట

జూన్ 21 నుంచి గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మెబాట

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామన్న కార్మిక సంఘాల జేఏసీ

మంత్రి కొప్పుల, ఎమ్మెల్సీ ,  జిల్లా కలెక్టర్, డిపిఓ లకు సమ్మె నోటీసు అందచేసిన కార్మికులు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని పలు డిమాండ్లతో పంచాయతి కార్మికులు సమ్మె నోటీస్ ను మంత్రి  కొప్పుల ఈశ్వర్ కు  కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అందజేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,జగిత్యాల జిల్లా కలెక్టర్ తో పాటు డిపిఓ కార్యాలయంలో సమ్మె నోటీసులు అందించారు. జూన్ 21 లోగా తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని నోటీసులో పేర్కొన్నారు.

 ఈ సందర్బగా వారు మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా12,769 గ్రామపంచాయతీలో 50,000 మంది గ్రామపంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో పారిశుద్ధ కార్మికులు, స్వీపర్లు, పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రిషన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్, జిల్లాలో నర్సరీలు, వైకుంఠధామం, పార్కులు, ఆఫీస్ నిర్వహణలో విధులు నిర్వహిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా పనులు చేస్తున్నప్పటికీ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయడం లేదు, పనికి గుర్తింపు, పని భద్రత, కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా అలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు.  గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేసి వేతనాలను ప్రభుత్వమే ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ట్రెజరీ ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు.

పిఆర్సి లో నిర్ణయించిన మినిమం బేసిక్ రూ. 19 వేలు చెల్లించాలి, ఆలోపు జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకు రూపాయలు 15,500, పంపు ఆపరేటర్లకు, ఎలక్ట్రిషన్లు, డ్రైవర్లు, కారోబార్ బిల్ కలెక్టర్లకు రూ19,500 నిర్ణయించాలన్నారు. కరోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలి. జీవో నెంబర్ 51ను  సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధాన రద్దుచేసి పాత కేటగిరీలు అన్నిటిని యధావిధిగా కొనసాగించాలన్నారు. విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మరణించిన సిబ్బంది కుటుంబానికి రూపాయలు 10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే ఇవ్వాలని, దీని అమలు  పోస్ట్ ఆఫీస్ బీమా పథకం ద్వారా చెల్లించాలన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సహజ మరణానికి ఇన్సూరెన్స్ పథకాన్ని రూ. 5  లక్షలకు  పెంచాలని డిమాండ్ చేశారు. పంచాయతీలలో ఆదాయం ఉన్నచోట వేతనాల పెంపుకు అనుమతి ఇవ్వాలని, 2011 జనాభా ప్రకారం కాకుండా అవసర ప్రతిపాదికన కార్మికులు తీసుకోవాలని ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ వేతనాలు పెంచి పిఎఫ్, ఇఎస్ఐ, ప్రమాద బీమా, గ్రాటిటీ, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన కార్మికునికి దహన సంస్కారాలకు 30 వేల ఆర్థిక సాయం అందించాలన్నారు.

 8 గంటల పని దినాన్ని అమలుచేసి వారాంతపు సెలవులు, పండగ సెలవులు, జాతీయ ఆర్జిత సెలవులు అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4  లేబర్ కోడ్ లను  రద్దు చేయాలని, గ్రామపంచాయతీ సిబ్బందికి అన్ని కార్మిక చట్టాలు అమలు చేయాలని, వివిధ పంచాయతీలలో కొత్తగా నియమించిన వారికి సంబంధించి గ్రామపంచాయతీ తీర్మానం చేసి డిపిఓ అనుమతి తర్వాతే నియామకాలు  జరగాలన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లకు పంచాయతీల ద్వారానే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలని వయసు మీరిందని సాకుతో కార్మికులను మార్చితే ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయలు ఐదు లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంవత్సరానికి మూడు జతల యూనిఫామ్, సరిపడా చెప్పులు, సబ్బులు, నూనెలు ఇవ్వాలని వాటిని నగదు రూపంలో అలవెన్స్ గా చెల్లించాలన్నారు కార్మికులపై వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పులి మల్లేశం, జిల్లా అధ్యక్షుడు కోమటి చంద్రశేఖర్, సాతల రాజేందర్, పంగా రాజేశం, కనికర సత్తయ్య,  లక్ష్మణ్, అంజన్న తదితరులు పాల్గొన్నారు.