బాసర లో పోటెత్తిన జనం - అక్షరాభ్యాసాల కోసం బారులు

బాసర లో పోటెత్తిన జనం - అక్షరాభ్యాసాల కోసం బారులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వసంత పంచమి పవిత్ర దినం సందర్భంగా నిర్మల్ జిల్లాలోని పలు దేవాలయాల్లో జనం పోటెత్తారు. ప్రధానంగా సరస్వతీ మాత కొలువైన బాసరలో భక్తులు తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. తెల్లవారు జామున రెండు గంటలకు అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసం  చేయించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము 3 గంటల నుంచే అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభం అయింది.  ప్రత్యేక క్యూ లైన్లు,అక్షరాభ్యాస కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. అక్షరాభ్యాసానికి దాదాపు 6 గంటలు, అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

కుక్కలు కరిచి 15 మందికి గాయాలు

ఇదిలా ఉండగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను కుక్కలు కరిచి గాయపరిచాయి. అర్ధరాత్రి సమయంలో దాదాపు 15 మంది భక్తులకు తీవ్ర గాయాలు కావటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.