రెప్పపాటులో ప్రమాదం.. రెండు కుటుంబాల్లో తీరని విషాదం..

రెప్పపాటులో ప్రమాదం.. రెండు కుటుంబాల్లో తీరని విషాదం..

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి రెప్పపాటులో జరిగిన ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.చెట్టంతా ఎదిగిన కొడుకులు రోడ్డు ప్రమాదం రూపంలో లారీ కింద పడి నుజ్జు నుజ్జు కావడంతో ఆ రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఒక్కగానొక్క కొడుకు ఇక లేడు అన్న నిజాన్ని రెండు కుటుంబాలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయి. కలిపురుషుడు తన పసుపు కుంకుమలను తీసుకెళ్లి పోవడంతో ఏడాది బాబుతో ఆమె ఏడుస్తున్న బాధ వర్ణనాతీతం. ఆదివారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి  రెడ్డి సంక్షేమ భవన్ సమీపంలో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం చిన్నకోడూరు మండలం మైలారం, కమ్మర్లపల్లి గ్రామాల్లోని రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. స్నేహితుని ఆహ్వానం మేరకు సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని గాంధీనగర్లో జరుగుతున్న పెద్దమ్మ ఉత్సవాల విందు భోజనానికి వచ్చిన స్నేహితులు ఇద్దరు తిరిగి వెళుతూ మృత్యువాత పడ్డారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మైలారం గ్రామానికి చెందిన గ్రామ భారత రాష్ట్ర సమితి యువజన విభాగం అధ్యక్షుడు బూరుగు వెంకటేశం గౌడ్(21), కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి కార్యకర్త జక్కుల నాగరాజు యాదవ్(23), రంజిత్ తదితరులు తమ మిత్రుడు పిలవడంతో గాంధీ నగర్ లో జరుగుతున్న పెద్దమ్మ బోనాల పండుగ విందు కు రెండు వాహనాలపై  వెళ్లారు. భోజనాలయ్యాక రాజీవ్ రహదారి మీదుగా తిరిగి రెండు వాహనాలపై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా రంగధాంపల్లి సమీపంలోని రెడ్డి సంక్షేమ భవన్ దగ్గర వెనుక నుంచి వచ్చిన ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన టిప్పర్ లారీ బూరుగు వెంకటేష్ గౌడ్ నడుపుతున్న ద్విచక్ర వాహనంపై నుంచి దూసుకెళ్లింది దీంతో వాహనం పైన ఉన్న వెంకటేష్ నాగరాజు ఇద్దరూ అక్కడికక్కడే నుజ్జు నజ్జై ప్రాణాలు కోల్పోయారు వెనకే వస్తున్న రంజిత్ ఈ హఠాత్పరిణామాలతో తల్లడిల్లిపోయారు.

ప్రమాద విషయాన్ని గ్రామ నాయకులకు తెలపడంతో వారంతా హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను సిద్దిపేట ఏరియా హాస్పిటల్ కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఆదివారం రాత్రి కావడంతో సోమవారం ఉదయము మృతదేహాలకు పోస్టుమార్టం జరిగింది తమ పార్టీ కార్యకర్తలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలియగానే భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ చిన్నకోడూరు మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ చిన్నకోడూరు ఎంపీపీ మాణిక్య రెడ్డి మైలారం గ్రామ సర్పంచ్ కాల్వ ఎల్లయ్య యాదవ్ ఎంపీటీసీ సభ్యుడు కీసరి పాపయ్య మాజీ ఎంపీపీ అధ్యక్షుడు రామచంద్రం పి ఏ సి ఎస్ చైర్మన్ కనకరాజు కొండా రవి తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.ఈ ప్రమాద విషయాన్ని అమెరికాలో ఉన్న మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. తమ పార్టీ కార్యకర్తల మృతి పట్ల హరీష్ రావు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ప్రభుత్వ పరంగా రెండు కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తల అంత్యక్రియలను దగ్గరుండి జరిపించాలని నాయకులను ఆదేశించారు.రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నాగరాజు, వెంకటేశులు ఇద్దరు ఒకే పార్టీకి చెందిన స్నేహితులు కావడం, గ్రామములోనూ వేరువేరు కులాలకు చెందినప్పటికీ కలిసి మెలిసి ఉండేవారు. మైలారం, కమ్మర్లపల్లి రెండు గ్రామాలు పక్కపక్కనే ఉండడం మధ్యలో రోడ్డు మాత్రమే అడ్డంగా ఉండడంతో తరచుగా వీరు కలిసే ఉంటారు. ఇక వెంకటేష్ గౌడ్ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడం వివాహం ఇంకా కాకముందే ప్రమాదంలో దుర్మరణం చెందడంతో అతని తల్లిదండ్రులు రాజయ్య గౌడ్ లచ్చవలు తల్లడిల్లిపోయారు. కమ్మర్లపల్లికి చెందిన జక్కుల నాగరాజు యాదవ్ కు వివాహమై భార్య లావణ్య తో పాటు ఒక సంవత్సరం కుమారుడు ఉన్నారు. ఇంటికి ఎదిగొచ్చిన ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాద రూపంలో ప్రాణాలను కోల్పోవడంతో అతని తల్లిదండ్రులు ఎల్లయ్య నరసవ్వలు,భార్య లావణ్య బోరున విలపిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇద్దరి మృతదేహాలకు వారి వారి స్వగ్రామాలలో అంత్యక్రియలు నిర్వహించారు. రెండు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వాటికి హాజరయ్యారు. గ్రామాల్లో ఏ నోట విన్న ఈ విషాదవార్త గూర్చి చర్చించుకోవడం కనిపించింది.