తూతూ మంత్రంగానే మున్సిపల్ సమావేశం

తూతూ మంత్రంగానే మున్సిపల్ సమావేశం
  • ప్రతి నెల చేతులెత్తుడు.. ఫోటోలు దిగుడు...
  • సమస్యల పరిష్కారం శూన్యం...

మెట్‌పల్లి ముద్ర:- మెట్‌పల్లి పట్టణ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా జరిగింది. బుధవారం పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో 19 ఎజెండా అంశాలను ప్రవేశపెట్టగా ఎప్పటిలాగే వాటిపై చర్చ జరగకుండానే సభ్యులు చేతులెత్తి ఆమోదించినట్లు సమాచారం. మున్సిపల్ పాలకవర్గంలో 26 మంది సభ్యులు ఉండగా కొందరు సర్వసభ్య సమావేశానికి హాజరై రిజిస్టర్ లో సంతకాలు పెట్టి ఎజెండా అంశాలు తెలుసుకోకుండానే ఇంటికి వెళ్లగా సమావేశంలో పాల్గొన్న మరి కొంతమంది సభ్యులతో ఎజెండా అంశాలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రతినెల జరిగే మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో 20 నుండి 30 ఎజెండా అంశాలను ప్రవేశపెడుతున్నారని. ప్రతినెల అంశాలను ఆమోదించినట్లు చేతులెత్తి ఫోటోలు దిగడం తప్ప ఆమోదించిన అంశాలలో ఏ ఒక్క అంశానికి మోక్షం కలగడం లేదని. ఎజెండా అంశాలకు వ్యతిరేకిస్తే తమ వార్డులలో అభివృద్ధి పనులు జరగవేమోనని ఆమోదిస్తున్నట్లు పలువురు ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

ప్రతి నెల కౌన్సిల్ ముందు ఒకే విధమైన సమస్యలు.

ప్రతి నెల మున్సిపల్ సమావేశ మందిరంలో జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో వివిధ వార్డులకు చెందిన పలువురు కౌన్సిల్ సభ్యులు తమ వార్డులకు మిషన్ భగీరథ నీరు రావడం లేదని, మురుగు కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని ఒకే విధమైన సమస్యను కౌన్సిల్ ముందు ఉంచుతున్నారు.కౌన్సిల్ సభ్యుల ప్రశ్నలకు త్వరలో పరిష్కారం చూస్తామని చెబుతున్నారు తప్ప ఇప్పటి వరకు ఏ వార్డులో కూడా సమస్యలు పూర్తి స్థాయిలు పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు అంటున్నారు.

సమస్యల పరిష్కారం శూన్యం...

పట్టణంలో ప్రతి నెల జరిగే సర్వసభ్య సమావేశంలో పలు వార్డులకు చెందిన సమస్యలను ఎజెండా అంశాలలో చేర్చి ఆమోదిస్తున్న పట్టణంలోని పలు వార్డులు అబివృద్దికి నోచుకోవడం లేదు. పట్టణంలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మరి కొన్ని వార్డులలో ఇప్పటి వరకు మిషన్ భగీరథ పైపు లైన్ ఏర్పాటు, డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవని పలు పార్టీల నాయకులు అంటున్నారు.