ఉల్లి ధరలు భారీగా పతనం 

ఉల్లి ధరలు భారీగా పతనం 

ఉల్లి రైతు కన్నీళ్లు పెడుతున్నాడు. ధరలు భారీగా పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావడం లేదని భోరుమంటున్నాడు. దేశవ్యాప్తంగా ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు రైతులు. తాజాగా ఉల్లి ధరల ఆందోళనలు మహారాష్ట్ర అసెంబ్లీని కూడా తాకాయి. ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు ఉల్లి దండలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. ప్రభుత్వమే కిలో రూ.15 నుంచి రూ.20కి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.  ఇక గుజరాత్‌లోనూ పంటకు గిట్టుబాటుధరలు లభించకపోవడంతో ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు. గుజరాత్‌లో ఉల్లికి అతిపెద్ద మార్కెట్‌ అయిన భావ్‌నగర్‌లో కిలో ఉల్లిధర కేవల 8 రూపాయలు మాత్రమే చెల్లించడంతో అన్నదాతల కష్టాలకు అంతులేకుండా పోతోంది. ఉల్లి ధరలు భారీగా పతనం కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కిలో ఉల్లి రూ.2లకు పడిపోయింది. దీంతో రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఉల్లి ధర అంశం మహారాష్ట్ర అసెంబ్లీకి తాకడంతో సభలో రచ్చ జరుగుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లికి ధర పూర్తిగా పడిపోవడంతో రైతులు ఆందోళనలో పడిపోయారు. ఎంతో పెట్టుబడి పెట్టి చివరకు నష్టాల్లో చిక్కుకుపోవడం కోలుకోలేని దెబ్బ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.