అన్యాయం జరిగింది... న్యాయం చేయండి..

అన్యాయం జరిగింది... న్యాయం చేయండి..
  • అర్హులకు ఇవ్వకుండా.. అనార్హులకు ఇచ్చారు..
  • తహసిల్దార్ ఆఫీస్ ఎదుట లబ్ధిదారుల ఆందోళన..

ముద్ర,గంభీరావుపేట: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో మాకు అన్యాయం జరిగింది,  న్యాయం చేయండి అని గంభీరావుపేట మండల కేంద్రంలోని తహసిల్దార్ ఆఫీస్ ఎదుట లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. సుమారు గంటపాటు లబ్ధిదారులు చంటి పిల్లలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై మహేష్ బందోబస్తు చేపట్టారు. అర్హులైన వారికి న్యాయం చేస్తామని,  ఇంకా 60 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మిగిలిపోయాయని,  అర్హులను గుర్తించి వారం రోజుల్లోగా పంపిణీ చేస్తామని తహసిల్దార్ భూపతి హామీ ఇవ్వడంతో  లబ్ధిదారులు ఆందోళన విరమించారు. ఏళ్ల నుంచి ఇండ్లు లేక కిరాయికి ఉంటున్నామని, నాలుగుసార్లు లిస్టులో పేరు వస్తే సంబర పడ్డామని, సొంతింటి కల నెరవేరుతుందని ఆశపడ్డామని,  తీరా ఫైనల్ లిస్టులో పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు సార్లు పేర్లు వచ్చి, ఫైనల్ లిస్టులో ఎందుకు పేర్లు తీసేశారని ప్రశ్నించారు. కొంతమంది అర్హులకు ఇవ్వకుండా,అనార్హులు కు ఇండ్లు ఇప్పించారని లబ్ధిదారులు  ఆరోపించారు. వీరి  ఆందోళనకు  మాజీ జడ్పిటిసి మల్లు గారి నర్సాగౌడ్  మద్దతు తెలిపారు.  ఈ సందర్భంగా నర్సాగౌడ్  మాట్లాడుతూ  అర్హులకు కాకుండా అనర్హులకు ఏ విధంగా పంపిణీ చేస్తారని అన్నారు.  గంభీరావుపేటలో  ఇండ్లు లేనివారు  పేదల ఉండకూడదని,  అప్పుడు మంత్రి కేటీఆర్  దృష్టికి తీసుకు వెళ్లడంతో,   ఎక్కడలేని విధంగా గంభీరావుపేట మండల కేంద్రంలో సుమారు 272 ఇండ్లు మంజూరు చేశారని అన్నారు. అర్హులకు డబుల్ బెడ్ ఇండ్లు మంజూరు చేసిన,ఇంకా సుమారు 20 వరకు మిగిలిపోతాయని,  కానీ చాటు చాటుగా లబ్ధిదాలని ఎంపిక చేశారని,  దీంతో అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని అన్నారు.ఈ ఆందోళనలో తెలంగాణ  బహుళ జన బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ముద్రకోల ఆంజనేయులు  ఉన్నారు.