ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరిగింది

ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరిగింది
  • ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరిగింది
  • ఉత్తమ ర్యాంకు లు సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్దులు
  • ప్రభుత్వ విద్యపై ప్రజలలో విశ్వాసం పెరిగింది
  • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:-తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ పాఠశాలు బలోపేతం కావడంతో ప్రజలలో ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసం పెరగిందని, ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ నందు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన విద్యా దినోత్సవం కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నత విద్యార్హత కలిగిన వారని, సబ్జెక్టు భోధన ప్రైవేటు కంటె సర్కారు బడులలోనే బాగుందని ఆయన అన్నారు. సర్కారు బడులలో చదివే విద్యార్థులకు  రాష్ట్ర స్ధాయి ర్యాంకులు వస్తున్నాయని, ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు సాధిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్ లో ప్రైవేటు కంటె నాణ్యతగల విద్యా భోధన జరుగుతుందని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్య,  వైద్య రంగంతో పాటు, విద్యుత్, సాగునీటి రంగంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని మంత్రి చెప్పారు. దశాబ్ది ఉత్సవాలు వివిధ శాఖల కార్యాలయాల వద్ద ప్రజలు, ఉద్యోగులు కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని మంత్రి అన్నారు. జిల్లాలో సాగునీటి సౌకర్యం పెరిగిందని, నిరంతరం విద్యుత్ సరఫరా జరుగుతుందని మంత్రి తెలిపారు.  ఫ్లోరైడ్ వ్యాధితో బాధపడుతున్న మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచినీటి సరఫరా చేసిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు.  ఈ సందర్భంగా పదవ తరగతి పరిక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్దులకు, ఉపాధ్యాయులకు  మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూంలు, లైబ్రరీ లు, మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, డైనింగ్ హాల్స్ నిర్మాణం, హరితహారం కార్యక్రమంలో చెట్ల పెంపకం, మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలలో అదనపు గదుల నిర్మాణం చేసినట్లు తెలియజేశారు.  విద్యా దినోత్సవం రోజున జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట రాగి జావ పంపిణీ కార్యక్రమం ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పి చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్, వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,  మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, డిఇవొ అశోక్,ఎంపిపిలు, జెడ్పిటిసి సభ్యులు,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.