చెరువైన సాయి నగర్ కాలనీ

చెరువైన సాయి నగర్ కాలనీ

ప్రతియేటా వర్షం తిప్పలు, పట్టించుకోని అధికారులు

ముద్ర ప్రతినిధి, మెదక్: చినుకు పడితే చిత్తడి.... ఇళ్ల ముందు వర్షపు నీటి మడుగులు... ఇళ్ల నుండి బయటకు వెళ్లలేని దుస్థితి...ఇది మెదక్ పట్టణం సాయినగర్ కాలనీ పరిస్థితి. వర్షాకాలం మొదలయిందంటే చాలు అవస్థలు తప్పవు. వెంకటరవు నగర్, సాయినగర్ పరిధిలో ప్రముఖ ప్రయివేట్ పాఠశాల ఉండటంతో పిల్లలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. మెదక్ పట్టణంలో చెప్పుకోదగ్గా కాలనీల్లో వెంకటరావు నగర్ కాలనీ ఒకటి. ఇక్కడ పట్టణంతో పాటు సమీప మండలాలకు చెందిన అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు నివాసం ఉంటారు.

సాయిదీప్ సూపర్ మార్కెట్, సాయినగర్ తదితర ప్రాంతాల్లో వర్షం చినుకు పడితే వణికే పరిస్థితి.  కొద్దిపాటి వర్షానికే కార్లు ఈదుతున్నాయి. లక్షల  రూపాయి పన్నులు కడుతున్నా మున్సిపల్ అధికారులు  పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో  వెంకటరావు కాలనీ, సాయినగర్ కాలినీ వాసులు పడరాని పాట్లు పడుతున్నారు.  బల్దియా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.