నాడు దూర్వాస - నేడు దుబ్బాక

నాడు దూర్వాస - నేడు దుబ్బాక
  • ఒకప్పుడు 47 గ్రామాలకు సంస్థాన కేంద్రం 
  • జోడు ధ్వజస్తంభాలకు, ఆలయాలకు నిలయం
  • చుట్టూ చెరువులు.. మధ్యలో ఊరు...
  • దూర్వాస మహాముని తపో స్థలి

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: ఒకప్పుడు రాజులు ఏలిన రాజ్యమది. సామంత దొరలు పరిపాలించిన సంస్థాన కేంద్రం అది. మునులు తపస్సు చేసుకున్న ధ్యాన కేంద్రం అది. అడుగడుగునా ఆలయాలకు నిలయమై, ప్రజలలో భక్తి భావం పెంచిన ఆధ్యాత్మిక క్షేత్రం అది. కాల చక్రంలో మారిన పరిణామాలతో పోరాటాలకు నిలయమైన రణక్షేత్రం అది.స్వరాష్ట్ర సాధనకై మొదలైన తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన గడ్డ అది.   కాసుల గలగలలతో కలకలలాడిన ఖజానా కేంద్రం అది. దూర్వాస మహాముని నాడు తపస్సు చేసిన ప్రాంతమై విలసిల్లి నేడు దుబ్బాక గా రూపాంతరం చెందింది.

ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని మున్సిపల్ కేంద్రమైన దుబ్బాక గత చరిత్రను అవలోకిస్తే ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలు మదిలో మెదులుతాయి. ఎందరినో ఆలోచింపజేస్తాయి. మరెందరినో ఔరా అని అబ్బురపరుస్తాయి. పూర్వపు మెదక్ జిల్లాలోనే దుబ్బాకకు చారిత్రక నేపథ్యం ఉంది.పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది.

ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామము చింతమడక ఈ దుబ్బాక తాలూకా సమితి పరిధిలోనే ఒకప్పుడు ఉండేది.కాకతీయుల గొలుసుకట్టు చెరువులన్నీ ఈ ఊరు చుట్టే ఉన్నాయి. మహామహులను అందించిన శక్తివంతమైన మట్టిగడ్డ అయినప్పటికీ ప్రస్తుతం అభివృద్ధిలో ఇంకా వెనుకడుగులోనే ఉంది. ఒకప్పుడు సిద్దిపేట వాసులకే అప్పులు ఇచ్చిన దుబ్బాక పై 'ముద్ర ప్రతినిధి' అందిస్తున్న ప్రత్యేక కథనం.దొరల సంస్థానంగా, తాలూకా సమితిగా, మండల కేంద్రంగా, మున్సిపాలిటీగా, ప్రస్తుతం నియోజకవర్గ కేంద్రంగా ఉన్న దుబ్బాక జనాభా ఇప్పుడు 30000 లోపే ఉంటుంది.సుమారుగా దుబ్బాకలో 18 వేల ఓటర్లు ఉన్నారు.

దుబ్బాకను స్వాతంత్రానికి పూర్వము దూర్వాసగా పిలిచేవారు.. దూర్వాస మహాముని ఇక్కడ తపస్సు చేసుకునే వారని స్థానికంగా ప్రతిష్టించిన జోడు స్తంభాల వద్ద నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లన్న గుట్టల్లోకి సొరంగ మార్గం ద్వారా ప్రతినిత్యం తపస్సు కోసం వెళ్లేవాడని పెద్దలు చెబుతున్నారు. ఆయన నివసించిన ప్రాంతమైనందునే దూర్వాస మహాముని పేరుతో ఉన్న గ్రామం దుబ్బాక గా పేరు మార్చబడినదని తెలిపారు.దీనికి బలమైన సాక్ష్యంగా 1950లోనే జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని దూర్వాస యువజన మండలి సభ్యులు ఏర్పాటు చేశారు.ఇప్పటికీ వారు ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్ముని విగ్రహము చూపర్లను ఆకట్టుకునే విధంగా చెక్కుచెదరకుండా అద్భుతంగా ఉంది. కాకతీయ రాజుల పరిపాలనలో చేపట్టిన గొలుసుకట్టు చెరువుల నిర్మాణం దుబ్బాక పైన సజీవ సాక్ష్యంగా నేటికీ నిలిచి ఉంది.

దుబ్బాక చుట్టూ చెరువులే ఉన్నాయి. దుబ్బాక నుంచి తూర్పు వైపుకు వెళ్తే దుంపలపల్లి గ్రామము ఉంటుంది. ఇటువైపు గ్రామ సమీపంలోనే ఏదుల చెరువు, నల్లచెరువు ఉన్నాయి. పడమర వైపున లచ్చపేట గ్రామం వెళ్తుంటే పెద్ద చెరువు రెండు గ్రామాల మధ్య  ఉంటుంది. ఇక దక్షిణం వైపున చేరువాపురం అబ్సిపురం గ్రామాలకు వెళ్తుంటే  రామసముద్రం చెరువు ఉంటుంది. ఇక ఉత్తరం వైపు పెట్టని కోటల మాదిరిగా మల్లన్న గుట్టలు ఉన్నాయి ఎకరాల్లో విస్తరించిన అటవీ ప్రాంతము మల్లయ్య పల్లి గ్రామం ఉన్నాయి. కాకతీయ రాజుల ఏలుబడిలో స్థానిక రెడ్డి లు దొరలుగా వ్యవహరిస్తూ దుబ్బాక సంస్థానాన్ని నిర్వహించేవారు. ప్రస్తుత గజ్వేల్ నుంచి దోమకొండ వరకు, ఇటు గంభీరావుపేట వరకు  47 గ్రామాలతో దుబ్బాక సంస్థానము విరాజిల్లింది. పన్యాల వంశస్థులు దుబ్బాక దొరలుగా పేరుగాంచారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి చిన్నమ్మను దుబ్బాక దొరికిచ్చి వివాహము జరిపించడంతో నాటి నుంచి నేటి వరకు కర్నూలుకు దుబ్బాకకు బంధుత్వాలు కొనసాగుతున్నాయి. ఇతర చోట్ల ఎక్కడా కనిపించని విధంగా దుబ్బాక నడిబొడ్డున జోడు స్తంభాలను నిర్మించారు. వాస్తవానికి దేవాలయాల ఎదుట మాత్రమే ధ్వజస్తంభం ఉంటుంది కానీ దుబ్బాక గ్రామంలో  మాత్రం ఆలయము లేకున్నా గ్రామ నడిబొడ్డున జోడు స్తంభాలను విశాలమైన స్థలములో నిర్మించి ప్రతిష్టించారు. గ్రామానికి వచ్చిన వ్యాధుల నివారణకై స్తంభాలను నిర్మించినట్లు ఇక్కడున్న ఆధారాలను బట్టి చెప్పవచ్చు.

దొరల సంస్థానంలో దుబ్బాక చుట్టూ రక్షణ కోసం ప్రజల, ప్రాణాలను కాపాడడం కోసం గోడలు, కోటలు, గడీలు  బురుజులు ఉండేవి ప్రధానమైనది తూర్పు వైపు దుంపలపల్లి దర్వాజా ఎంతో పేరుగాంచింది. దానిని 1990 ప్రాంతంలో కూల్చివేశారు. గడులను, బురుజులను కూడా అదే సమయంలో గ్రామాభివృద్ధి స్థలాల కోసం, కూరగాయల మార్కెట్ కోసం కూల్చివేశారు. నక్సలైట్ల ఉద్యమాలు జిల్లాలోకి విస్తరించిన క్రమంలో దుబ్బాకలోనూ అవి వ్యాపించి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దొరలు హైదరాబాదుకు ముందుగానే వలస వెళ్లిపోగా నక్సలైట్ల జమానాలు వారి ఆస్తులను కూడా పలువురు కబ్జాలకు పాల్పడ్డారు. క్రమంలోనే దొరల మీద అక్కసుతో స్థానికులు వారి ఆనవాళ్లను పూర్తిగా తుడిచి వేసినట్టుగా చెబుతున్నారు. గ్రామంలో ఉన్న దొరల చే నిర్మితమైన భవనం మాత్రం వారి వారసులు విక్రయించుకోవడంతో ఇతరుల చేతికి వెళ్లిపోయింది.

పన్యాల ఉమాపతి రెడ్డి, పన్యాల వెంకటరామారెడ్డి అన్నదమ్ములు ఇద్దరూ సంస్థానా అధ్యక్షులుగా కొనసాగారు. వారి కుటుంబీకులు పన్యాల సోమేశ్వర్ రెడ్డి పన్యాల శ్రీనివాస్ రెడ్డి కొన్నాళ్లు దుబ్బాకలో నివసించగా ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులంతా హైదరాబాద్, చెన్నై , బెంగళూరు తదితర ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. జన్మభూమి పథకాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టినప్పుడు సిద్దిపేట, మెదక్ సంగారెడ్డి ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు కూడా దుబ్బాక నుంచి డబ్బులను అప్పుగా తీసుకుని వెళ్లి కాంట్రాక్టులు చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.

ఆర్థికంగా దుబ్బాక ఒకప్పుడు బాగా ఎదిగి వ్యాపార రంగంలో రాణించిందని చెప్పవచ్చు.  ఫైనాన్స్ రంగం నెలకొన్న దివాలతో అప్పుడే దుబ్బాక ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. దుబ్బాకలో కాకతీయుల కాలం, దొరల కాలం నుంచి అనేక ఆలయాలకు నిలయం అని చెప్పవచ్చు ...గ్రామంలో పురాతనమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి .అందులో ముఖ్యమైనవి శ్రీ ఉమామహేశ్వరాలయం, శ్రీ కేదారేశ్వర ఆలయము, శ్రీ కాశి విశ్వనాథ ఆలయం,శ్రీ విఠలేశ్వరాలయం, శ్రీ నీలకంటేశ్వరాలయము ఎంతో పేరుగాంచిన ఆలయాలు ఉండగా ప్రస్తుతం 10 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నూతనంగా ఏడాది క్రితం నిర్మించారు. అంతేకాకుండా గ్రామదేవతలైన పోచమ్మ దేవాలయం, మైసమ్మ దేవాలయం, నల్ల పోచమ్మ దేవాలయం, మారెమ్మ తల్లి దేవాలయం , మైసమ్మ తల్లి దేవాలయాలు ఉన్నాయి.ఇంకా కుల దేవతల గుడులు మార్కండేయ స్వామి దేవాలయము, పెద్దమ్మ దేవాలయం రేణుక ఎల్లమ్మ దేవాలయం, గంగాభవాని దేవాలయం, మహంకాళి అమ్మ దేవాలయము, మాల పోచమ్మ దేవాలయం, మడేలయ్య దేవాలయం ఉన్నాయి.

దుబ్బాక నుంచి రాజకీయ ప్రముఖులుగా ఎదిగిన వారందరూ ఉన్నారు వారిలో 1980 దశకములో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన ఐరేని లింగయ్య గౌడ్ ప్రముఖులు .ఇక్కడ పాముకాటుకు మంత్రం వేసే సంప్రదాయము అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది. ప్రతి ఆదివారము వేలాదిమంది వచ్చి ఇక్కడ మంత్రం వేయించుకొని వెళ్తుంటారు.