తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శ పథకాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శ పథకాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శ పథకాలు: న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు

తెలంగాణలో ప్రజా సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు, లబ్దిదారుడు లేని కుటుంబం లేదు: మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి

ముద్ర సిరిసిల్ల టౌన్;  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించిన సిరిసిల్ల నియోజకవర్గం స్థాయి సంక్షేమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, టిఎస్పిటిడిసి చైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి పాల్గొన్నారు. న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు మాట్లాడుతూ ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఒకవేళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే సరైన పరిపాలన లేక తెలంగాణ రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని, ప్రజల బతుకులు ఆగమవుతాయని ఎద్దేవ చేసిన ఆంధ్ర ప్రాంత నాయకుల నోర్లు మూయించేలా తొమ్మిదేళ్ల కాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోరి రైతుబంధు, రైతు బీమా, నేతన్నకు బీమా, కళ్యాణ లక్ష్మి వంటి ఎన్నో సంక్షేమ పథకాలను స్వంత ఆలోచనల ప్రకారం రూపకల్పన చేసి అమలులోకి తెచ్చి పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తూ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఆదర్శ పథకాలుగా నిలిపారు అన్నారు. 

జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడపడుచులు గర్భస్థ స్థితిలో ఉన్నప్పుడు వారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ, కెసిఆర్ కిట్ ద్వారా ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు, మగ పిల్లగాడు పుడితే 12 వేల రూపాయల ప్రోత్సాహాన్ని అందిస్తూ, అమ్మ ఒడి వాహనాల ద్వారా తల్లి బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేరుస్తూ, పిల్లలకు మన ఊరు మనబడి కార్యక్రమం, సంక్షేమ హాస్టల్ ల నిర్వహణ ద్వారా మంచి నాణ్యమైన విద్య తో పాటు పోషక ఆహారాన్ని అందిస్తూ, విదేశాలలో చదువుకునే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా 20 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ కార్యక్రమం ద్వారా ఆడపిల్లల పెళ్ళికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మేనమామ లాగా అండగా నిలుస్తూ బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో నిరోధించగలిగారు అన్నారు. 


మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ ఇవాళ తెలంగాణలో ప్రజా సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు, లబ్దిదారుడు లేని కుటుంబం లేదు అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్, రిజర్వాయర్ల నిర్మాణం, మిషన్ కాకతీయ మిషన్ భగీరథ వంటి మొదలగు పథకాలను నిర్వహిస్తూ ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తూ, షీ టీమ్స్ నిర్వహణ ద్వారా మహిళలకు భద్రతను కల్పిస్తూ, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, తెలంగాణ రాష్ట్రంలో సబండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మన ముఖ్యమంత్రి సుపరిపాలనను సాగిస్తూ దేశ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థాయిలో నిలుపుతున్నారు అని అన్నారు. అంతేకాకుండా ఈ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బీసీ కులాలకు లక్ష రూపాయలు పూర్తి సబ్సిడీతో కూడిన నగదు అందించి ఆయా వర్గాల ఆర్థిక అభివృద్ధినీ కాంక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. 


అనంతరం గొల్ల కురుమలకు గొర్రె పిల్లలను అందిస్తూ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందించి, కులవృత్తులపై ఆధారపడి జీవించే బీసీ కులాలకు చెందిన అర్హులకు లక్ష రూపాయల పూర్తి సబ్సిడీ నిధులను అందజేస్తూ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు లోన్ ప్రొసీడింగ్ కాపీలను అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ శాఖ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నరసయ్య, వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు , జెడ్పిసిఈఓ గౌతమ్ రాజు, మైనారిటీ అభివృద్ధి శాఖ జిల్లా అధికారి సర్వర్, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.