కాంగ్రెస్ లో చల్లారని రెండు టికెట్ల లొల్లి

కాంగ్రెస్ లో చల్లారని రెండు టికెట్ల లొల్లి
  • సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చోటుతో ఉత్తమ్ ధీమా
  • తమతోపాటు సీట్ల పోటీకి సరితూగే అభ్యర్థులు లేకపోవడంతో జానారెడ్డి కుమారుల హవా
  • ఉన్నత స్థాయి పదవులు దక్కకపోవడంతో కోమటిరెడ్డి అలక
  • సూర్యాపేట టికెట్ ఎవరికి అనే అంశంలో కొనసాగుతున్న సస్పెన్స్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో రెండు టికెట్ల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉంది పైకి అంతా బాగుంది అన్నట్లు కనిపిస్తున్నప్పటికీ అంతర్గత పోరు ఆయా నాయకుల మధ్యన రగులుతూనే ఉంది. సస్పెన్స్ త్రిల్లర్ హైడ్రామా మాదిరిగా కొనసాగుతున్న కాంగ్రెస్ సినిమాలో హీరోలు ఎవరు జీరోలు ఎవరు అనేది వెల్లడి కావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నది. ఉన్నత పదవులు రాలేదని కొందరి నాయకుల అలకలు, బుజ్జగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. నలుగురు కలిసినప్పుడు పైకి నవ్వుకుంటూ కనిపించిన కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ టికెట్ పైరవీలు మాత్రం చాప కింద నీరులా ఒకరి అయితే లేకుండా మరొకరు చేస్తూ అధిష్టానం మెప్పుకోసం పాకులాడుతూ టికెట్ సంపాదించుకునే పనిలో బిజీగా ఉన్నారు

రెండు నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టిన ఉత్తం దంపతులు

హుజూర్నగర్ నుండి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నుండి ఆయన సతీమణి ఉత్తం పద్మావతి రెడ్డిలు పోటీ చేయడానికి నిశ్చయించుకొని ఇప్పటికే నియోజకవర్గంలో ప్రముఖులను కలుస్తూ అంతర్గతంగా ప్రచారం మొదలుపెట్టారు దీనికి తోడు ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డికి సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చోటు  దక్కడం టికెట్ల ఎంపికలో కలిసి వచ్చే అంశం. ఉదయపూర్ లో జరిగిన కాంగ్రెస్ డిక్లరేషన్ లో తీసుకున్న నవ సంకల్ప్( న్యూ  రిజల్యూషన్) ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికే సీటు అనే అంశం ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తమ దంపతులిద్దరికీ టికెట్లు కావాలని విషయంలో ఉత్తంకుమార్ రెడ్డి సోనియా,రాహుల్ ని సైతం కలిసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా రెండు టికెట్లు ఇచ్చే అంశంలో చర్చ వాడి వేడిగా సాగింది. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కూడా పోటీలో ఉండే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను నిర్ణయించే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ లో ఉత్తంకుమార్ రెడ్డి చోటు సంపాదించడంతో మొత్తానికి ఇన్నాళ్లుగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో కొనసాగిన విభేదాలు అంతరించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఫైనల్ లిస్టులో కి రోల్ పోషించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇద్దరు కుమారుల కోసం జానారెడ్డి పైరవీలు

మిర్యాలగూడ నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి తన ఇద్దరు కుమారులను ఎన్నికల బరిలో నిలపడానికి నిశ్చయించుకున్న మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు ఇందుకోసం అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సభ్యులు బాబా సిద్ధిక్ జిగ్నేష్ మేవాని, తెలంగాణ ఇంచార్జ్ మానిక్ ఠాక్రే ఎసిసి జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ తో పాటు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తో ఆయన టచ్ లో ఉన్నారు. దీంతో మిర్యాలగూడ నుంచి పోటీలో ఉంటాడు అనుకున్నా బి ఎల్ ఆర్ బిజెపి వైపు చూస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా జాతీయస్థాయిలో తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ముఖ్యమైన పదవుల్లో కీలకమైన స్థానాల్లో తనకు చోటు కల్పించలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలక పూనటం, కాంగ్రెస్ పెద్దలు ఇంటికి వెళ్లి బుజ్జగించడం జరిగిన సంగతి తెలిసిందే అయితే తనకు పదవులు రాని విషయం ఏ నాయకుడు చెప్పినప్పటికీ పరిగణలోనికి తీసుకుంటాడా వారి మాట పెడచెవిన పెడతాడా అన్నది కూడా మునుముందు తెలుస్తుంది. అంతేకాకుండా నకిరేకల్ భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో కూడా తన వర్గం వారికి టికెట్లు ఇవ్వాలని కోమటిరెడ్డి పట్టుబడుతున్నారు. 
తాజాగా నకిరేకల్ సీటును వీరేశంకు ఇవ్వవద్దని అక్కడి నాయకులు కార్యకర్తలు ఆందోళన చేశారు. సూర్యాపేట అసెంబ్లీ టికెట్ విషయంలో కూడా మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ల మధ్యన కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఎవరికి టికెట్ దక్కుతుందో అనే విషయంలో క్రిస్టల్ క్లియర్ ఇంకా రాకపోవడంతో ఇరువర్గాల మధ్యన అంతర్గత పోరు కొనసాగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ కూడా తాను చెప్పిన వారికే ఇవ్వాలని దామోదర్ రెడ్డి కోరుతున్నట్టు సమాచారం.

మహారాష్ట్ర కేరళ కర్ణాటక రాష్ట్రాల నాయకుల వ్యూహం ఫలించేనా 
 కాంగ్రెస్ కు  విజయం దక్కేనా

తెలంగాణలో కాంగ్రెస్ను అసెంబ్లీ ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చడానికి ఇతర రాష్ట్రాల నాయకులు పన్నుతున్న వ్యూహ ప్రతి వ్యూహాలు అనుకూలించి కాంగ్రెస్ విజయం సాధిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ ఠాక్రే మహారాష్ట్రకు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కే మురళీధరన్, ఏ ఐ సి సి జనరల్ సెక్రెటరీ కే సి వేణుగోపాల్ కేరళకు, ఎన్నికల వ్యూహం పన్నుతున్న సునీల్ కనుగోలు డీకే శివకుమార్ లు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు మొత్తానికి కర్ణాటక మహారాష్ట్ర కేరళ కు చెందిన రాజకీయ 
దిగ్గజాలు తెలంగాణలో కాంగ్రెస్ ను గెలుపు దిశగా నడిపిస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే

ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్యన కొనసాగుతున్న కనిపించని అంతర్గత పోరు టికెట్లు కేటాయింపు అయిపోయాక అయినా  సద్దుమణుగుతుందా లేదంటే ప్రెస్టేజ్ కి పోయి తమ వర్గం వారికి టికెట్ రాలేదని ఇతరులను ఓడించడానికి సంసిద్ధులు అవుతారా అన్న విషయాల్లో స్పష్టత మరి కొద్ది రోజుల్లో వస్తుందని పార్టీ సీనియర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.