ఓ రైతన్నా...జర పైలం..!

ఓ రైతన్నా...జర పైలం..!
  • అప్రమత్తతే అన్నదాతలకు రక్ష
  • చిత్తడి కాలం.. పాములతో పైలం
  • ప్రకృతి వైపరీత్యాలు, విద్యుత్‌తో పొంచి ఉన్న ప్రమాదాలు
  • ఏమరపాటుగా ఉంటే ప్రాణాలకే ముప్పు
  • వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి
  • ప్రమాదాల నివారణ మన చేతుల్లోనే...

మునగాల ముద్ర: ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమయ్యింది.వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులకు, వ్యవసాయ కూలీలకు అనుకోకుండా సంభవించే ప్రకృతి వైపరీత్యాలు, పంట పొలాల్లో ఉండే విద్యుత్‌ మరమ్మతు పనులు, మందుల పిచికారీ పనులతో ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతుంటారు. నిత్యం వ్యవసాయ క్షేత్రాల్లో ఉంటూ పంటల దిగుబడి పెంచుకోవడం కోసం పొంచి ఉన్న ప్రమాదాలను అధిగమించడం రైతులకు పరీక్ష కాలం వంటింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. పిడుగు పాటు, విద్యుత్‌ విపత్తులు, విష పురుగుల సంచారం, మందుల పిచికారీ వంటి సమయాల్లో రైతన్నలు ప్రమాదాల భారిన పడడంతో పాటు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరుచూ చూస్తూ, వింటూనే ఉన్నాం. పొలాల్లో పచ్చికబయళ్లు పెరగడంతో ఎక్కడ ఏ విష పురుగు ఉందో కని పెట్టడం కష్టం ఉంటుంది. అయితే అన్నదాత అప్రమత్తంగా ఉండి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను అధిగమించవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం....

విపత్తులతో అప్రమత్తంగా ఉండాలి...

వర్షాకాలంలో పొలాల్లో ఉన్న కరెంట్‌ మోటార్‌లలో వర్షం నీరు చేరి సమస్యలు వస్తుంటాయి. వీటిని సరి చేసేందుకు రైతులు జాగ్రత్తలు పాటించకుండా మోటార్లను ముట్టుకోవడం వల్ల విద్యుత్‌ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. మోటార్‌బోర్డులో స్టార్టర్లు, వర్షానికి తడవకుండా ఉండే ప్లాస్టిక్‌ డబ్బాలు అమర్చుకోవాలి. మోటార్లను ఆన్‌ ఆఫ్‌ చేసే సమయంలో చేతులకు తడి లేకుండా చూసుకోవాలి. చేతులకు గ్లౌజ్‌లు వాడడం వల్ల విద్యుత్‌ ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చు. రైతులు ఎప్పుడు వెంట టెస్టర్‌, కాళ్లకు చెప్పులు ఉంచుకుంటే మంచిది. ఇక మెరుపులతో కూడిన వర్షాలు కురియడం సర్వసాధారణం. ఈ సమయంలో తడవకుండా ఉండేందుకు రైతులు చెట్ల కిందకు వెళ్లి తల దాచుకుంటారు. ఇలాంటి సమయంలో చెట్లపై పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితిల్లోనూ చెట్ల కిందకు వెళ్లకూడదు. విద్యుత్‌ ప్రసరించే వస్తువులు, విద్యుత్‌ తీగలకు దూరంగా ఉండాలి. వర్షంలో తడవకుండా ఉండేందుకు ప్లాస్టిక్‌ దుస్తులను లేదా రేయిన్‌ కోట్‌లను ధరించాలి. చెట్టు, విద్యుత్‌ తీగలకు దూరంగా పొలాల గట్లపై ఉండాలి.

విషపూరిత జీవుల పట్ల నిర్లక్ష్యం తగదు...

ప్రస్తుతం విషపూరిత జీవులు విరివిగా పంట పొలాల్లో సంచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పాములు ఎలుకలను, కప్పలను తినేందుకు బయట తిరుగుతూ, చెట్ల పొదల్లో ఉంటాయి. అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉంటూ ఏదైన ప్రమాదం సంభవించినప్పుడు నిర్లక్ష్యం వహించకూడదు. ముఖ్యంగా పాము కాటేస్తే ఒంటిపై రెండు లేదా నాలుగు కామా ఆకారపు గుర్తులు పడతాయి. అరగంట లోపు విషయం ఒళ్లంతా పాకి నాడి వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. కండ్లు మూతలు పడడం, చేతులు, కాళ్లకు తాత్కాలికంగా పక్షవాతం రావడం, మాట ఆగిపోవడం, నాలుకకు రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్త పింజర కరిచిన భాగం ఉబ్బి తీవ్రంగా నొప్పి కలిగిస్తోంది. అర గంటలో నోట్లోంచి, చెవుల్లోంచి రక్తస్రావం జరుగుతుంది. పాము కాటు వేసిన భాగాన్ని ఎక్కువగా కదిలించరాదు. ఆ భాగాన్ని బట్టతో లేదా టవల్‌తో గట్టిగా కట్టాలి. ఇలా చేయడం వల్ల విషయం శరీరంలోకి వ్యాపించదు. కట్టును పది నిమిషాలకు ఒకసారి వదిలి మళ్లీ కడుతూ ఉండాలి. పాము కాటు వేసిన చోట కొత్త బ్లేడుతో ప్లస్‌ గుర్తు మాదిరి ఒక సెంటిమీటర్‌ లోపలి వరకు కోయాలి. కాసేపటికి విషంతో కూడిన రక్తం దానంతట అదే బయటకు పోతుంది. సాధ్యమైనంత తొందరగా సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళితే వైద్యుడి స్నేక్‌ వినమ్‌ తీసుకుంటే ప్రాణాపాయం ఉండదు. రాత్రి వేళల్లో పొలం వద్దకు వెళ్లే రైతులు శబ్దం చేస్తూ టార్చ్‌ లైట్‌ వెంట తీసుకెళ్లాలి.

మందుల పిచికారీ సమయంలో..

పంట పొలాల్లో మందులు పిచికారీ చేసే సమయాల్లో రైతులు సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల తరచూ ప్రమాదాల భారిన పడుతుంటారు. ఎరువులు, క్రిమి సంహారక మందులు పిచికారీ చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండడం వల్ల రైతులు అస్వస్థతకు గురై ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. పురుగు మందుల పిచికారీ చేసేటప్పుడు చేతులకు గ్లౌస్‌లు,ముక్కుకు మాస్క్ ధరించాలి. పిచికారీ మందులను గ్లౌవ్స్‌ వేసుకున్న చేతితో గాని లేదా కర్ర సహాయంతో గాని కలుపుకోవాలి. పురుగు మందులు ఎరువులు మందులు పిచికారీ చల్లడం అయిపోయిన వెంటనే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇంటికి వెళ్లగానే స్నానం చేసిన తర్వాతే భోజనం చేయాలి. పురుగు మందులు ఎరువుల డబ్బాలు వాటిని వెంటనే సర్ప్ నీటితో శుభ్రం చేసుకోవాలి.