విద్యార్థులకు  విద్యతో పాటు రక్షణకు  ప్రత్యేక కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్

విద్యార్థులకు  విద్యతో పాటు రక్షణకు  ప్రత్యేక కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట : విద్యార్థుల విద్యాభ్యున్నతికి , రక్షణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్ లో   సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహల్లోని విద్యార్థులకు గుణాత్మకమైన విద్యాబోధనతో పాటు పూర్తి రక్షణ కల్పించాలని సూచించారు. పిల్లల హాజరు శాతం పెంపుతో పాటు మెరుగైన విద్యానందించి ఉత్తీర్ణత శాతం పెరిగేలా ప్రత్యేక కృషి చేయాలని ఆదేశించారు.   వసతి గృహాల్లో   అవసరమున్న చోట మరుగుదొడ్ల నిర్మాణానికి అంచనా వేసి ప్రతిపాదనలు అందించాలని ఇంజనీరింగ్  అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. పిల్లలకు విద్యాబుద్దులతో పాటు క్రీడా, కల్చరల్ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేలా ప్రత్యేక తర్ఫీదు అందించాలని అన్నారు. కస్తూరిబా పాఠశాలల్లో పిల్లల క్రీడాభివృద్ది చెందేలా స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని సూచించారు. రెసిడెన్సిల్ కళాశాలలో ఒక ప్రభుత్వ అధికారిని ఆత్మీయుడుగా నియమించి మెరుగైన సేవలతో పాటు అన్ని కార్యక్రమాలు పర్యవేక్షించాలని అలాగే సంక్షేమ వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా  తన దృష్టికి తేవాలని సూచించారు . కారుణ్య నియామకాలపై సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.  అనంతరం అధికారులతో సిబ్బంది వివరాలతో పాటు పని తీరు అడిగి తెలుసుకున్నారు.

ఈ  సమావేశంలో  సంక్షేమ అధికారులు శంకర్, ఇస్తేర్, శిరీష దయానంద రాణి, జ్యోతి పద్మ, డి.ఏ.ఓ అశోక్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.