ట్రోలింగ్ పాలిటిక్స్..​ సోషల్ మీడియా ఇంజినీరింగ్

ట్రోలింగ్ పాలిటిక్స్..​ సోషల్ మీడియా ఇంజినీరింగ్
  • చాన్స్​ దొరికితే చాలు..మీమ్స్, కార్టూన్స్
  • ఇటు వివాదాలు.. అటు జోకులు, విసుర్లు
  • ప్రతి పార్టీకీ, నేతకూ ఇపుడు అవే కీలకం
  • ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేసి దాడి
  • ఒక్కోసారి యుద్ధాన్ని తలపిస్తున్న పోస్టులు
  • పలువురికి వేతనం ఇచ్చి మరీ నిర్వహణ
  • ఈసీ హెచ్చరించినా ఫలితం అంతంతే
  • పాలకుల మాటలు కూడా వారికే పరిమితం 

సోషల్​మీడియాను యేడాది కిందటి వరకు నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్​అధినేత కేసీఆర్ ఇప్పుడు అదే వింగ్ ను కీలకంగా తీసుకుటున్నారు. ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వపరంగా కూడా ఓ చైర్మన్​ను నియమించారు. టెక్నాలజీ సర్వీసు కోసమంటూ బయటకు చెబుతున్నా, సోషల్​ మీడియా విభాగాన్ని నడిపించేదంతా ఈ విభాగమే. ఇక, సోషల్ మీడియాలో ఇటీవల బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​ మధ్య వార్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ చిన్న లూప్‌ హోల్ దొరికినా ఆడేసుకుంటుంటారు. దీని కోసం సోషల్ మీడియాలో ఓ మినీ యుద్ధమే జరుగుతున్నది. ఫేస్‌బుక్, ట్విట్టర్ అన్న తేడా లేకుండా కొన్ని రోజులు అవే ట్రెండింగ్‌. ఎన్నికలలో గెలుపు కోసం తమ నాయకులను ప్రమోట్ చేసుకోవడం ఒక ఎత్తయితే, ఎదుటోళ్లను డీగ్రేడ్ చేయడం మరో ఎత్తు, వీటిని రాజకీయ ప్రత్యర్థులు పక్కాగా అమలుచేస్తున్నారు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ సోషల్ మీడియా గ్రూపులలో విస్తృతంగా ట్రోల్​అవుతున్నాయి. ‘పాదయాత్ర అంటే.. పాదాల మీద నడిచే యాత్ర’ ఈ మధ్య బాగా ట్రోల్ అయిన మాటలివి. ‘థూ మీ బతుకులు చెడ' అంటూ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించగానే,  ‘ఓ పెగ్గు ఎక్కువైనందుకే ఆయన నోటి నుంచి అలాంటి పదాలు వినాల్సి వచ్చిందని’ ప్రత్యర్థి పార్టీలు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాయి. కార్టూన్లు, కథనాలతో ఆయనను టార్గెట్ చేశాయి. ‘ఇవాళ ఏ వారమన్నా.. ఏం కూరన్నా.. ఇంకేది మనకు పండుగలు తెలిసే.. వారాలు తెలిసే..’  ‘ప్లీజ్​... ప్లీజ్​... ప్లీజ్​.. ఒక్క ఛాన్స్​.. ఒకే ఒక్క ఛాన్స్​.. ప్లీజ్​.. ప్లీజ్​.. ప్లీజ్’
‘దేవుడన్నా నా మోడీ.. దేవుడన్నా’ అన్న బండి సంజయ్​ వ్యాఖ్యలు కూడా ట్రోలింగుకు గురయ్యాయి. ‘మాట్లాడితే తాను పెద్ద దేశభక్తుడినని చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎయిర్‌ఫోర్స్‌లో అసలు వెలగబెట్టిందేమి లేదంటూ’ బీఆర్ఎస్ కొన్ని వీడియోలను వైరల్ చేస్తోంది. రెండు ఎయిర్‌క్రాఫ్ట్స్‌ క్రాష్ అవడానికి ఉత్తమ్ కారణమని, తద్వారా రూ.500కోట్లు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. వీటిపై విపరీత ట్రోలింగ్స్​ మొదలయ్యాయి. ప్రగతిభవన్ లో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ సంజయ్​ చేసిన వ్యాఖ్యలపై మీమ్స్​ మామూలుగా రావడం లేదు. లక్షలలో పేలుతున్నాయి. వీటిని బీజేపీ సోషల్​ మీడియా ఓ రకంగా ప్రచారానికి తీసుకువస్తుంటే, ఇదే సమయంలో ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టేందుకు గులాబీ దండు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది.

సోషల్​ వార్​ పెరిగింది
 సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత రాజకీయ పార్టీలు దానిపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నాయి. వేదికల మీద మైకులలో, టీవీ లైవులలో ఎంతలా డబ్బా కొట్టుకుంటున్నారో, సోషల్ మీడియాలో అంతకు రెట్టింపు డబ్బా కొట్టుకుంటున్నారు. సొంత డబ్బా సంగతెలా ఉన్నా, ప్రత్యర్థులపై విమర్శల కత్తులు నూరడంలో మాత్రం ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. వీడియోలతో, కార్టూన్లతో, వండి వార్చిన కథనాలతో బురద జల్లుకుంటున్నారు.

 ప్రతీ దాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రత్యర్థులపై పదునైన వ్యంగ్యాస్త్రాలతో  సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. పాపులర్ పర్సనాలిటీలే ప్రత్యర్థుల చేత ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. కొన్నిచోట్ల వ్యక్తిగత జీవితాలను కూడా లాగి పనికిరాని చర్చలు పెడుతున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇవన్నీ ఆయా పార్టీ నేతలల కనుసన్నులలోనే జరుగుతున్నాయో లేదో తెలియదు కానీ, చాలాసార్లు ఈ ట్రోలింగ్స్ శ్రుతి మించి సోషల్ మీడియాలో యుద్ద వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అందుకే ఈసీ సైతం సోషల్ మీడియా పోకడపై ఇప్పటికే ఓ కన్నేసి పెట్టింది. అభ్యర్థుల పేరిట సర్క్యులేట్ అయ్యే షార్ట్ ఫిలింస్, సానుకూల కథనాలు ఇవన్నీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులోనే జమచేస్తామని ప్రకటించింది. మీడియాకు ఎలాంటి నిబంధనలైతే వర్తిస్తాయో, సోషల్ మీడియాకు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయని, హద్దులు దాటకుండా ఉండాలని ఈసీ హెచ్చరిస్తోంది. 

గవర్నర్ పైనా ట్రోలింగ్స్​
ఇటీవల చెన్నయిలో గవర్నర్​ ఆగ్రహంగా మాట్లాడారు. తన రంగు, రూపు గురించిన ట్రోల్​ చేయడంపై సీరియస్​గా వార్నింగ్​ ఇచ్చారు. ఇలాంటి ట్రోలింగ్​ సోషల్​ మీడియా నుంచే బయటకు వచ్చాయి. గవర్నర్ వర్సెస్ రూలింగ్ పార్టీ వివాదం పెరిగిపోవడంతో ట్రోల్స్​ కూడా పెరిగాయి. ‘ సోషల్ మీడియాలో హద్దు దాటితే ఖబడ్దార్. ఎవర్నీ ఉపేక్షించం’ ఇది తరచుగా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, పోలీసులు చెప్పేమాట. కానీ ఇది అధికార పార్టీ వ్యతిరేక పోస్టులకు మాత్రమే పరిమితమవుతోంది. విపక్షాలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ అడ్డగోలు పోస్టులు పెట్టినా వాటిపై చర్యలు మాత్రం శూన్యమే. ఇటీవల కొత్తగా మరో పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. గవర్నర్‌ను దిష్టిబొమ్మగా చూపిస్తూ చేసిన ఆ పోస్ట్‌పై విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. అయినా ఇలాంటి వాటిపై పోలీసులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి గవర్నర్ తనవంతు సహకారాన్ని అందిస్తున్నట్టుగా కూడా సోషల్​ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 

ఉద్యోగాల ప్రకటనపైనా మీమ్స్​
రాబోయే ఒకటిన్నరేండ్లలో పది లక్షల మందిని ప్రభుత్వం ఉద్యోగాలలో నియమిస్తామని ప్రధాని ఇటీవల ప్రకటించారు. దీనిని స్వాగతిస్తున్నానంటూ గవర్నర్ తమిళిసై తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుండి రీ-ట్వీట్ చేశారు. దానిపై నెటిజనులు విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ 91,142 ఉద్యోగాలను ప్రకటించినప్పుడు కనీసం పట్టించుకోని గవర్నర్.. మోడీ పది లక్షల ఉద్యోగాల గురించి ట్వీట్ చేయడమేంటని, అందులో పక్షపాతం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ‘గతంలో ప్రధాని మోడీ ప్రకటించినట్లుగా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా?  హామీ మేరకు నల్లధనం తీసుకొచ్చారా? కనీసం 30,000 ఉద్యోగాలు సృష్టించగల తెలంగాణకు ఐటీఐఆర్ ఇచ్చారా? ఈ 10 లక్షల ఉద్యోగాలు కూడా కేవలం మరొక జుమ్లా’ అంటూ బీఆర్​ఎస్​ సోషల్​ మీడియా వ్యతిరేక పోస్టులను పెట్టింది. దీనికి బీజేపీ సోషల్​ మీడియా కూడా అదేస్థాయిలో రెచ్చిపోయింది. ఎనిమిదేండ్ల  నుంచి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారంటూ, ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్నవారి వివరాలను పోస్టు చేశారు. కేసీఆర్​ కుటుంబంలో వచ్చిన రాజకీయ ఉద్యోగాలను, నిరుద్యోగుల వ్యథలను ట్రోల్స్​ చేశారు. 

ఖరీదైన వేతనాలతో ఉద్యోగాలు
ఇప్పుడు అన్ని పార్టీలు ట్రోల్స్​ పెంచాయి. తాజాగా షర్మిల వ్యాఖ్యలపై విపరీతంగా మీమ్స్​ పెడుతున్నారు. పాదయాత్ర, శంకర్ నాయక్​, సుదర్శన్​ రెడ్డి మగతనం వంటి వ్యాఖ్యలపై బహిరంగంగా చెప్పలేని ట్రోల్స్​ పెడుతున్నారు. గతంలో తమ ప్రత్యర్థులకు మాత్రమే పరిమితమైన బీఆర్ఎస్​ సోషల్​ మీడియా, ఇప్పుడు చిన్నా చితకా లీడర్లను కూడా వదిలిపెట్టడం లేదు. బీఆర్ఎస్​ నేతలను సమర్థించుకుంటూనే వ్యతిరేకులపై బాంబులు పేల్చుతున్నారు. కేవలం బీఆర్ఎస్​ మాత్రమే కాదు, అన్ని రాజకీయ పార్టీలు సోషల్​ మీడియానే ఆధారం చేసుకుంటున్నాయి. ఒక్కొక్కరిని నెలకు రూ. 50వేలకు పైగా జీతాలిచ్చి సోషల్​ మీడియా ట్రోలింగ్​ కోసం నియమించుకుంటున్నారంటే పరిస్థితి అర్థమవుతున్నది. మీడియా సంస్థలలో పని చేసే వారిని రాజకీయపార్టీల సోషల్​ మీడియా కోసం ఉద్యోగులుగా నియమించుకుంటున్నారు.