దుబాయ్ కేసులో పురోగతి..

దుబాయ్ కేసులో పురోగతి..
  • ఫలితానిస్తున్న మంత్రి కేటీఆర్ దుబాయ్ పర్యటన
  • 17 ఏండ్లుగా దుబాయ్ జైళ్లో రాజన్నసిరిసిల్ల జిల్లా వాసులు
  • ఐదుగురిలో ఒక్కరికి క్షమాభిక్షా .. నలుగురి జడ్జీమెంట్ వివరాలు తెలియాల్సి ఉంది
  • 17 ఏండ్ల జైలు జీవితం తర్వాత స్వగ్రామం రానున్న కోనరావుపేట వాసి
  • మిగతా నలుగురి కోసం మంత్రి కేటీఆర్ పేషీ అధికారులు ప్రయత్నాలు
  • ఎంబసీ అధికారులతో మరోసారి చర్చలు..

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:ఓ కేసులో 17సంవత్సరాలుగా దుబాయ్ జైళ్లో మగ్గుతున్న రాజన్నసిరిసిల్ల జిల్లా వాసుల విడుదల కోసం మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుంది. గత 15 ఏండ్లుగా మంత్రి కేటీఆర్ సొంత డబ్బులు చెల్లించి పలువురు సహకారంతో దుబాయ్ జైళ్లో ఉన్న వారి విడుదల కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేష్, గొల్లెం నాంపల్లి, దుండగుల లక్ష్మణ్ ,శివరాత్రి హనుమంతులు ఒక కేసులో భాగంగా దుబాయ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపు ఇప్పటికే 17 సంవత్సరాలకు పైగా తమ జైలు శిక్ష పూర్తి చేసుకున్నారు. కేటీఆర్ ఇప్పటికే ఈ నేరంలో ప్రాణాలు కోల్పోయిన నేపాల్ కు చెందిన బాధిత కుటుంబం దగ్గరికి స్వయంగా వెళ్లి మంత్రి కేటీఆర్ , దియ్య సొమ్ము (బ్లడ్ మనీ) అందించారు. ఆ తర్వాత ఆ కుటుంబం క్షమాభిక్ష పత్రాన్ని దుబాయ్ ప్రభుత్వానికి సమర్పించి క్షమాభిక్ష కోరారు. దుబాయ్ లాయర్ అనురాధ ఈ కేసులో మొదట చాలా కృషి చేశారు. ప్రస్తుతం దుబాయ్ అరబ్ లాయర్ను ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. అవసరమైన ఫీజులు కూడా మంత్రి కేటీఆర్ చెల్లించారు.

మంత్రి కేటీఆర్ దుబాయ్ పర్యటన.. కేసులో పురోగతి..

మంత్రి కేటీఆర్ ఈ నెల 6న దుబాయ్ పర్యటనలో భాగంగా ఈ కేసు విషయంలోపై  దుబాయ్ లో ఎంబసీ అధికారులతో పాటు బాధిత కుటుంబ సభ్యులతో, దుబాయ్ లాయర్, అక్కడి సామాజిక సేవా కార్యకర్తలు రాధారపు సత్యం, జువ్వాడి శ్రీనివాస రావులతో చర్చించారు. తాజాగా దుబాయ్ కోర్టు జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురిలో రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన దుండుగుల లక్ష్మణ్ కు క్షమాభిక్షాను దుబాయ్ కోర్టు ప్రసాదించింది. త్వరలోనే లక్ష్మణ్ స్వదేశం రానున్నారు. మరో నలుగురి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఒకే కేసులో వీరికి క్షమాభిక్షా వచ్చిందా లేదా అనే విషయం ఆన్లైన్లో కనిపించకపోవడంతో మిగతా కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. దీంతో మంత్రి కేటీఆర్ ఆదేశాలతో పేషీ అధికారులు దుబాయ్ ఎంబసీ అధికారులతో మాట్లాడుతున్నారు. పూర్తి వివరాలు.. తెలుసుకున్నాక చెబుతామని పేరొన్నారు.