చురుగ్గా ధాన్యం కొనుగోళ్లు

చురుగ్గా ధాన్యం కొనుగోళ్లు
  • రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
  • 1131 కొనుగోలు కేంద్రాలు, 90వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
  • మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముఖ్యమంత్రి ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించడానికి పౌరసరఫరాల శాఖ సర్వం సిద్దం చేసిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  కరీంనగర్ లో మంత్రి నివాసంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో  సమీక్ష నిర్వహించారు.

 యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలో నెంబర్ 1గా నిలిచిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు అనుకూల విధానాలు, రైతుబందు, రైతుబీమా, 24గంటల ఉచితకరెంటు, కాళేశ్వర జలాలతో పంట విస్థీర్ణం ఏటికేడు పెరుగుతూ రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైతు పండించిన చివరిగింజను మద్దతు ధరతో కొనాలన్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. ప్రపంచవ్యాప్త నివేదికల్లో ఓవైపు యావత్ ప్రపంచంలో 20ఏళ్ల కనిష్టానికి బియ్యం ఉత్పత్తి పడిపోతుంటే, కేవలం తెలంగాణలో మాత్రమే బియ్యం ఉత్పత్తి ఆరింతలు పెరిగిందన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాధించిన ఘనత అని పేర్కొన్నారు.

నిన్నటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1131 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా 186 కోట్లు విలువ చేసే 90వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని అన్నారు. అత్యధికంగా నల్గొండ, నిజమాబాద్ లో కొనసాగుతుందన్నారు. ధాన్యం అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు స్థానిక యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. లక్ష్యం మేరకు సేకరణకు అవసరమైన 7031 పైచీలుకు కొనుగోలు కేంద్రాలు, గన్నీ బ్యాగులు, మాయిశ్చర్ మిషన్లు, వేయింగ్ మిషన్లు, హమాలీలును సమకూర్చుకున్నామని వెల్లడించారు. అకాల వర్షాల నేపథ్యంలో టార్పలిన్లను సైతం అందుబాటులో ఉంచామన్నారు. రైతులు ఫెయిర్ ఆవరేజి క్వాలిటీతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి దాన్యం అమ్ముకోవాలని మంత్రి సూచించారు.

ఈ సమీక్షలో సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, పౌరసరఫరాల సంస్థ జిఎం రాజారెడ్డి, కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా డి సి ఎస్ ఓ, సురేష్ రెడ్డి డి ఎం  శ్రీకాంత్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.