ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నాం

ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నాం
  • పుష్ పుల్ రైలు నడపండి
  • రైల్వే అధికారులకు ఉద్యోగ ఉపాధ్యాయుల వినతి

కేసముద్రం, ముద్ర: కాజీపేట నుంచి డోర్నకల్ (విజయవాడ) వరకు ఉదయం పూట నడిచే పుష్ పుల్ రైలు రద్దు చేయడంతో ఆ రైలులో నిత్యం షటిల్ సర్వీసులు చేసే వందలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ గమ్యస్థానాన్ని చేరడానికి గోసపడుతున్నారు. ఈ మార్గంలో నడిచే పుష్ పుల్, సింగరేణి ఎక్స్ ప్రెస్ రైళ్ళను గత నెలలో తొలుత వారం రోజులపాటు రద్దు చేశారు. ఆ తర్వాత మరో వారం తాజాగా ఇంకో వారం రైళ్ల రద్దును పొడిగించారు. ఉదయం పూట వరంగల్ నుంచి పుష్ పుల్ రైలులో నెక్కొండ, ఇంటికన్నె, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం వరకు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగా ఉపాధ్యాయులు వందల సంఖ్యలో నిత్యం వస్తుంటారు. ఉదయం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల పని వేళలకు చేరుకునే విధంగా పుష్ పుల్  రైలు అనుకూలంగా ఉండడంతో కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లలో పుష్ పుల్ రైలు ఎక్కి ఆయా గమ్యస్థానాలలో దిగుతుండడం నిత్య కృత్యంగా మారింది. ఇందులో ప్రయాణించే ఉద్యోగులు ఉపాధ్యాయులు నెలవారి లేదంటే క్వార్టర్లీ సీజన్ టికెట్లు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఆ రైలులోనే ప్రయాణించి విధి నిర్వహణ చేద్దామనుకున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు తరచుగా పుష్ పుల్ రైలు రద్దు ప్రకటన షరాఘాతంగా మారింది. ఆ సమయంలో మార్గమధ్యలో ఉన్న స్టేషన్లో ఆగేవిధంగా ప్రత్యామ్నాయ రైలు లేకపోవడంతో వరంగల్ నుంచి ఉదయం పూట వచ్చే వారంతా ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకొని వస్తున్నారు. మరికొందరు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఇంకొందరు మహబూబాబాద్, డోర్నకల్ ఖమ్మం స్టేషన్లలో ఉదయం పూట హాల్టింగ్ ఉన్న సూపర్ ఫాస్ట్ రైళ్లలో చేరుకొని అక్కడ నుంచి మళ్లీ ఆటోలు, ద్విచక్ర వాహనాలపై వారు పనిచేసే చోటికి చేరుకుంటున్నారు. దీనితో ఆర్థిక భారం, దూర భారం, మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు వాపోతున్నారు. పుష్ పుల్ రైలు నడపకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తక్షణం రైలును పునరుద్ధరించాలని కోరుతూ నిత్యం ఆ రైలు ద్వారా షటిల్ సర్వీసులు చేసే ఉద్యోగ ఉపాధ్యాయులు సోమవారం రైల్వే అధికారులకు వినతి పత్రం సమర్పించారు.