గ్రామ సభలో  సంక్షేమ పథకాలపై రచ్చ - ఇరు వర్గాలను సముదాయించిన సర్పంచ్

గ్రామ సభలో  సంక్షేమ పథకాలపై రచ్చ - ఇరు వర్గాలను సముదాయించిన సర్పంచ్

ముద్ర, ఎల్లారెడ్డిపేట: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి సర్పంచ్ వెంకట్ రెడ్డి  పూలమాలలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభకు అధ్యక్షతన వహించిన సర్పంచ్ వెంకట్ రెడ్డి సంక్షేమ పథకాలపై రెండు కులాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన కొర్రి ప్రమోద్ రజకులకు ఉచిత కరెంటు ఇస్తున్న వారు గ్రామస్తుల దుస్తులు ఇస్త్రీ చేస్తూ డబ్బులు ఎక్కువగా తీసుకుంటున్నారని సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లగా అక్కడే ఉన్న రజకులు ఒక్కసారిగా కోపో దృక్తులై మీ సామాజిక వర్గానికి దళిత బంధు రావడం లేదా అని ప్రశ్నల తూటాలు కురిపించారు. మా రజకుల పట్ల మీకు అంతా అక్కసు ఎందుకు అంటూ ప్రమోద్ పైకి లేచారు. వెంటనే సర్పంచ్ వెంకట్ రెడ్డి కల్పించుకొని ఇరువర్గాలను సముదాయించారు. అదేవిధంగా ఎల్లారెడ్డిపేట గ్రామంలో తలారిగా పనిచేయడానికి ఎవరూ లేరని ఎవరైనా చనిపోతే అంతక్రియలు నిర్వహించడానికి ఇబ్బందులకు గురవుతుందని సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన సర్పంచ్ వెంకట్ రెడ్డి ఇవ్వరు చనిపోయిన తమ ఇంటివారు 1000 ఇవ్వాలని సూచించారు.  

తలారి పనిచేసిన వారికి 10వేల వేతనం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మాజీ ఎంపిటిసి ఓగ్గు బాలరాజు యాదవ్ వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయని ఈ మధ్యకాలంలో ముగ్గురిని కరవడం జరిగిందని వాటిని నివారించాలని సూచించగా కుక్కలను చంపి వేయడానికి మనుషులను పిలిపించడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. గ్రామంలో ఉన్న స్మశాన వాటికల ముందు  విద్యుత్ సౌకర్యం లేదని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వీధిలైట్లను వెంటనే అమర్చాలని కోరడంతో  సంబంధిత సెస్  సంస్థ నుండి వీధిలైట్లను ఏర్పాటు చేస్తామని అన్నారు.  గ్రామంలోని అనేకమందికి పెన్షన్స్ రావడం లేదని కాంగ్రెస్ నాయకులు గుర్రపు రాములు గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లగా అర్హులైనవారు తనను కలిసి దరఖాస్తు ఇవ్వాల్సిందిగా సూచించారు. ఆరో వార్డులోని  ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు నిర్మాణం కాలేవని అదే వార్డులో మోరి నిర్మాణం కూడా కావాలని సూచించడంతో త్వరలో ఎన్నికల కోడ్ సమీపిస్తుండడంతో ఇట్టి పనులు ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చని సర్పంచ్ సమాధానం ఇవ్వగా రానున్న ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు ఎలా అడుగుతారని ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ఎదురు ప్రశ్నించడం జరిగింది. మెప్పించి ఓట్లు వేయించుకోవడం జరుగుతుందని సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దేవరాజు, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ , వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.