ఈవిఎం యంత్రాల పనితీరు పట్ల పూర్తి అవగాహన పొందాలి

ఈవిఎం యంత్రాల పనితీరు పట్ల పూర్తి అవగాహన పొందాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే

ముద్ర ప్రతినిధి భువనగిరి: ఈవిఎం యంత్రాల పనితీరు పట్ల పూర్తి అవగాహన పొందాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే పోలింగ్ అధికారులకు సూచించారు. శనివారం భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి వెన్నెల ఇంజనీరింగ్ కాలేజీలో, ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి రాయగిరి లోని విద్యాజ్యోతి హైస్కూలులో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్స్ ద్వారా నిర్వహించిన రెండవ విడత శిక్షణా కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ఈవియం యంత్రాల పట్ల, పోలింగ్ మెటీరియల్ పట్ల పూర్తి అవగాహన పొందాలని సూచించారు.

29 తేదీన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో చెక్ లిస్టు ప్రకారం మెటీరియల్, ఫామ్స్, ఈవియం యంత్రాలను తీసుకోవాలని, ఈవియం యంత్రాల సీల్ ట్యాగ్స్, వివిప్యాట్లలో పేపర్ లోడ్, అడ్రసు ట్యాగ్స్ సరిచూసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న తరువాత పోలిగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని వారికి పోలింగ్ నిబంధనలు తెలియపరచాలని అన్నారు. 30 వ తేదీ పోలింగ్ రోజు ఉదయమే పోలింగ్ కు 90 నిమిషాల ముందు పోలింగ్ ఏజెంట్ల సమక్షములో మాక్ పోల్ నిర్వహించి అనంతరం అసలు పోలింగుకు సిద్ధం కావాలని, అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంటును మాత్రమే అనుమతించాలని, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. తన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియ సాఫీగా, పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలను తీసుకోవాలని, పూర్తి అప్రమత్తతతో విధులు పూర్తి చేయాలని సూచించారు. శిక్షణా కార్యక్రమాలలో భువనగిరి రిటర్నింగ్ అధికారి పి.అమరేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.