మారుమూల విద్యార్థి డాక్టర్ పట్టా అందుకుంది

మారుమూల విద్యార్థి డాక్టర్ పట్టా అందుకుంది
  • చిన్నప్పుడే తల్లిని కోల్పోయినా..
  • తండ్రి ప్రోత్సాహంతో ఎంబిబిఎస్ పూర్తి

ముద్ర ప్రతినిధి, మెదక్:బుడి బుడి నడక సమయంలోనే తల్లిని కోల్పోయింది..తండ్రి ప్రోత్సాహంతో పట్టువదలకుండా అనుకున్న లక్ష్యం నెరవేర్చింది. ఎంబిబిఎస్ పూర్తి చేసి పట్టా అందుకుంది మారుమూల విద్యార్ధి. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం జక్కన్నపేటకు చెందిన చామంతుల ప్రవళిక ఆదిలాబాద్ రిమ్స్ లో ఎంబిబిఎస్ (2017)పూర్తిచేసి పట్టా అందుకుని అందరిచే శభాష్ అనిపించుకుంది. చామంతుల సత్యనారాయణ(మాజీ సర్పంచ్), గాయత్రిలకు కూతుళ్లు స్నేహ, ప్రవళిక,  కుమారుడు రాహుల్ జన్మించారు. వీరు బాల్యంలో ఉండగానే తల్లి గాయత్రిని రోడ్డు ప్రమాదం కబళించింది. మృత్యు ఒడికి చేరింది.

అయినప్పయికీ తండ్రి సత్యనారాయణ తల్లి లేని లోటు కనిపించనివ్వకుండా ప్రోత్సహించాడు. మంచి విద్యను అందించాడు. అదే స్థాయిలో పిల్లలు బాగా కష్టపడి చదివారు. తల్లి లేని ఆ పిల్లలకు సరస్వతి మాత కరుణించింది. వీరి చదువులో తండ్రితో పాటు అమ్మమ్మ, మేన మామల కృషి కూడ ఉంది. పెద్దమ్మాయి స్నేహ బీటెక్ పూర్తి చేయగా ప్రస్తుతం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తుంది. కుమారుడు రాహుల్ వరంగల్ లో నిట్ లో బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రెండవ అమ్మాయి ప్రవళిక ఆదిలాబాద్ రిమ్స్ లో ఎంబిబిఎస్ పూర్తి చేసింది. ఆదివారం రాత్రి పట్టా అందుకుంది. మారుమూల జక్కన్నపేట గ్రామంలో జన్మించిన విద్యా కుసుమలను పలువురు అభినందించారు.