నేతల్లో బి ఫామ్ టెన్షన్

నేతల్లో బి ఫామ్ టెన్షన్
  • కాంగ్రెస్ లో కవ్వంపల్లి కి  కన్ఫామ్
  • బిఆర్ఎస్ లో ఎవరికి అందని బి ఫామ్
  • అంతర్మదనం  లో ఆశావాహులు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు టికెట్లను ఖరారు చేస్తూ బీఫాంలు అందజేస్తున్నాయి. ఈ క్రమంలో వివిధ పార్టీల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావాహులు తమకు టిక్కెట్లు వస్తాయో లేదో అన్న అయోమయంలో ఉన్నారు. అధికార బిఆర్ఎస్ పార్టీలో  సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ అభ్యర్థిత్వలు ఖరారు చేస్తామని ఆ పార్టీ అధినేత కేసిఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రకటన అనంతరం నియోజకవర్గాల వారీగా పలు సర్వేలు నిర్వహించారు. సర్వేల ఫలితాల ఆధారంగా కొన్నిచోట్ల మార్పులు చేర్పులు తప్పవని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఆదివారం కేవలం 51 మంది అభ్యర్థులకు మాత్రమే కెసిఆర్ బీఫాంలు అందజేశారు. కొన్ని నియోజకవర్గాలు తప్పనిసరి పరిస్థితులలో అభ్యర్థులను మార్చవలసి వస్తుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో ఎవరికి వారే తమకు బి ఫామ్ దక్కుతుందో లేదోనన్న అంతర్మదనంలో  పడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఏ ఒక్కరికి కూడా ఆదివారం బీఫామ్ అందలేదు. చొప్పదండి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను ఆ పార్టీ నాయకులే  వ్యతిరేకిస్తూ అతనికి టిక్కెట్టు ఖరారు చేయొద్దంటూ పలు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టిన విషయం విధితమే.

దీని ప్రభావం తనపై ఉంటుందో నన్న టెన్షన్లో సుంకే రవిశంకర్ ఉన్నారు. కరీంనగర్ గంగుల కమలాకర్, మానకొండూరు రసమయి బాలకిషన్, హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డిలు తమకు నేడో రేపో అధినేత బి ఫామ్ లు అందజేస్తారన్న ధీమాలో ఉన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలో మానకొండూరు నియోజకవర్గం అభ్యర్థిగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. దీంతో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో కొత్త జైపాల్ రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేనేని రోహిత్ రావు లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. మొదటి విడతలో కరీంనగర్ టికెట్ ఖరారు చేయకపోవడంతో ఎవరికి టిక్కెట్టు దక్కుతుందో నన్న టెన్షన్లో ఉన్నారు. చొప్పదండి నియోజకవర్గం లో మేడిపల్లి సత్యం తనకు టిక్కెట్ దక్కుతుందన్న ధీమాతో ఉండగా తొలి జాబితాలో పేరు రాకపోవడంతో ఆయన సైతం ఆందోళనలో ఉన్నారు.

టిఆర్ఎస్ లోని ముఖ్య నేత మేడిపల్లి సత్యమును పార్టీలోకి ఆహ్వానించినట్లు పలు వార్తలు వెలబడ్డాయి. అలాగే బొడిగె శోభ సైతం కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మేడిపల్లి సత్యం మరింత టెన్షన్ కు గురవుతున్నారు. హుజరాబాద్ నియోజకవర్గం నుండి బల్మూరి వెంకట్, ఒడితెల ప్రణవ్ ల మధ్య పోటీ ఉంది. అయితే స్వయంగా ఏఐసీసీ అగ్ర నాయకులే ప్రణవ్ ను పార్టీలోకి ఆహ్వానించి స్పష్టమైన హామీ ఇవ్వడంతో అతనికి టికెట్ దక్కుతుందన్న ప్రచారం జరుగుతుంది. బల్మూరి వెంకట్ ను యూత్ ను ఆకట్టుకోవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల క్యాంపెనర్ గా ఉపయోగించుకోవాలని టి పి సి సి భావిస్తుంది. ఇదిలా ఉండగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఉంది. మొదటి విడతలో పొన్నం ప్రభాకర్ పేరు ఖరారు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ తొలి జాబితాలో లేకపోవడంతో పొన్నం తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడవుతుంది. దీంతో పొన్నం అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అభిమానులు రెండో జాబితాలో తమ నాయకుడికే టికెట్ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. బిజెపిలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి టిక్కెట్ల ప్రక్రియ లేదు. వారం రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి టిక్కెట్లు ఖరారు చేస్తామని బిజెపి నాయకత్వం ప్రకటించింది.