తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..గుట్కాపై నిషేధం

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..గుట్కాపై నిషేధం
  • అమ్మినా,తయారు చేసిన కేసులు

ముద్ర,తెలంగాణ:-రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆరోగ్యానికి హానిక‌ర‌మైన గుట్కాను నిషేధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు గుట్కా తయారీ, అమ్మ‌కాల‌పై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే 24 నుంచి ఏడాది కాలం పాటు ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని ఉత్తర్వుల్లో స్ప‌ష్టం చేశారు. గుట్కా, పాన్ మాసాల‌లో ఆరోగ్యానికి హాని క‌లిగించే పొగాకు, నికోటిన్ ఉండ‌డం మూలంగానే వాటిని నిషేధించిన‌ట్లు పేర్కొన్నారు. గుట్కాను త‌యారు చేసినా, నిల్వ ఉంచినా, విక్ర‌యాలు జ‌రిపినా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు.

2021లో కూడా పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. పొగాకు ఉత్పత్తులను నిషేధించాలంటూ 160 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేసిన ధర్మాసనం.. వాటిని నిషేధించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. కానీ, అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా సీఎం రేవంత్​రెడ్డి గుట్కా నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. శనివారం నార్కోటిక్​ బ్యూరోతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గుట్కా తయారీ, అమ్మకాలపై చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే వాటిని నిషేధించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.