31న   శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ 

31న   శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ 

మంత్రి గంగుల, టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :తెలంగాణ రాష్ట్రం కరీం నగర్ పట్టణంలో టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనుంది. మే 31వ తేదీ భూమి పూజ కార్యక్రమం కోసం తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష్యులు  వినోద్ కుమార్, హైదరాబాద్ టీటీడీ స్థానిక సలహామండలి అధ్యక్ష్యులు భాస్కర్ రావు  శుక్రవారం టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ఎవి ధర్మారెడ్డి తో సమావేశమయ్యారు.
     ఆలయ నిర్మాణానికి టీటీడీ కి 10 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల గురించి వారు వివరించారు. కరీంనగర్ ప్రజలకు కలియుగ  ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండేలా టీటీడీ చక్కగా ఆలయాన్ని నిర్మించాలని వారు కోరారు. భూమి పూజకు ముందుగా మే 22వ తేదీ టీటీడీ అర్చకులు భూకర్షణం కార్యక్రమం నిర్వహిస్తారని ఈవో తెలియజేశారు. గర్భాలయ స్థలాన్ని నాగలితో దున్నుతారు. అక్కడ నవధాన్యాలు చల్లుతారు. ధాన్యాలు మొలకెత్తిన తరువాత గోవులకు ఆహారంగా వినియోగిస్తారు. ఆ తరువాత చదును చేసి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. దీన్నే భూకర్షణం అంటారని తెలిపారు.

31వ తేదీ భూమి పూజ ముగిశాక అదే ప్రాంగణంలో సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తామని మంత్రి చెప్పారు.   జేఈవో లు  సదా భార్గవి,  వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీనాగేశ్వర రావు, ఈఈ  నరసింహమూర్తి, ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు పాల్గొన్నారు